కాంగ్రెస్‌లో రేగిన 'ఢీ'సీసీల చిచ్చు..!

కాంగ్రెస్‌లో రేగిన ఢీసీసీల చిచ్చు..!
x
Highlights

2019 సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న అడుగులు తెలంగాణలో తడబడుతున్నాయి. పార్టీకి దూరమైన వర్గాలకు దగ్గరి...

2019 సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న అడుగులు తెలంగాణలో తడబడుతున్నాయి. పార్టీకి దూరమైన వర్గాలకు దగ్గరి చేసుకునే లక్ష్యంతో చేపట్టిన డీసీసీల నియమాకం నేతల మధ్య చిచ్చు పెడుతోంది. డీసీసీ అధ్య‌క్షుల ఎంపికలో స‌మ‌తుల్య‌త లోపించిందంటూ నేత‌లు వ‌ర్గాల వారిగా వాయిస్ పెంచుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో జిల్లా అధ్య‌క్షుల నియామకాలు చిచ్చు రేపుతున్నాయి. సీటీ కాంగ్రెస్‌తో క‌లుపుకొని మొత్తం 34 డీసీసీలకు సంబంధించిన ప్రక‌ట‌న డిల్లీ నుంచి వెలువ‌డిన వెంట‌నే జిల్లాల వారిగా వ‌ర్గ‌పోరు బుస‌లు కొట్ట‌డం ప్రారంభ‌మైంది. జిల్లాల వారిగా ముఖ్యనేత‌లు ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూయ‌డం మొద‌లు పెట్టారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా అధ్య‌క్షుల నియామ‌కాలు నేత‌ల మధ్య మరోసారి వ‌ర్గ‌పోరు రాజేసింది. హ‌స్తిన నుంచి డిసీసీల లిస్ట్ ప్ర‌క‌ట‌న రాగానే పిన‌పాక ఎమ్మెల్యే రేగ కాంతారావు త‌న అసంతృస్తిని వెళ్ళగ‌క్కుతూ త‌న పార్టీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు సంధించారు. భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లా డీసీసీని త‌న‌కు కాద‌ని మ‌రో ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావుకు ఇవ్వడంపై ఫైర్ అవుతున్నారు.

నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మానాల మోహన్ రెడ్డి నియమించడంతో అసంతృప్తి సెగలు రేగాయి. హైకమాండ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక ఇంచార్జీ డీసీసీ అధ్యక్షునిగా ఉన్న కేశవేణుకు నాలుగో సారి సిటీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఐతే నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వేణు సాధారణ కార్యకర్తగా పనిచేస్తానంటూ ప్రకటించారు. ఇలా ఒకేసారి ఇద్దరు సీనియర్ నేతలు తమ పదవులకు రాజీనామా చేయడం కార్యకర్తలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.

ఎమ్మెల్యేల‌కు డీసీసీ ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డంపైనా తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఇప్ప‌టికే ఎమ్మెల్యేల ప‌ద‌విలో ఉండ‌గా మ‌ళ్ళీ కొత్త‌గా ప‌ద‌వులేంటని పలువురు ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్ర పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు హైకమాండ్‌ను తప్పుదారి పట్టించి, తమ అనుచరవర్గానికి మాత్రమే పదవులు కట్టబెట్టుకున్నారంటూ పలువురు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నేతలంతా ఒకేతాటిపైకి వస్తారనే అంచనాతో అధిష్టానం డీసీసీలను ప్రకటిస్తే అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడటం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories