Top
logo

చెరో పార్టీలో ఆలుమగల యుద్ధం

చెరో పార్టీలో ఆలుమగల యుద్ధం
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రముఖంగా కనిపించే రాజకీయ కుటుంబాలలో దగ్గుబాటి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఏదో...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రముఖంగా కనిపించే రాజకీయ కుటుంబాలలో దగ్గుబాటి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఏదో ఒకపార్టీతో అనుబంధం కొనసాగిస్తూ అధికారం చుట్టూ తిరుగుతూ ఉంటారన్న ప్రచారం సైతం ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్టీఆర్ కుమార్తె, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధీశ్వరి బీజెపీ అభ్యర్ధిగా విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దిగితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం వైసీపీ తరపున అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. భార్యదో పార్టీ...భర్త, కొడుకుదీ ఓ పార్టీ...ఎందుకిలా?

భార్య...భర్త...కలసి నడిస్తేనే ఏ సంసారమైనా సాఫీగా, విజయవంతంగా సాగిపోతుంది. భార్యది ఓదారి భర్తది మరోదారి అయితే ఆ కుటుంబం పరిస్థితి ఎవరికివారే యమునా తీరే అవుతుంది. అయితే ఇది కేవలం జీవితానికి మాత్రమే వర్తించే నిజం. రాజకీయాలే వృత్తిగా, ప్రవృత్తిగా సాగే కుటుంబాలలో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు రాజకీయపార్టీలలో సభ్యులుగా ఉండటం, అనుబంధం కొనసాగించడం సాధారణ విషయమే.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దగ్గుబాటి దంపతులు పురంధీశ్వరి, వెంకటేశ్వరరావు మాత్రం చెరో పార్టీని నమ్ముకొని ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. దగ్గుబాటి కుటుంబం రెండుపడవల మీద ఎందుకు కాళ్లు వేసిందన్న అంశంపై ప్రస్తుతం రాజకీయవర్గాలలో ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎన్నికల సమరంలో చెరోదారి పట్టడం ఉత్కంఠను రేపుతోంది.

ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దగ్గుబాటి కుటుంబం చరిత్ర చూస్తే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీర్ పెద్దలుడుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పెద్దకూతురుగా పురందేశ్వరి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. 1979లో ఎన్టీఆర్ అల్లుడుగా మారిన డాక్టర్ దగ్గుబాటి 1982లో ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు.

1985లో మార్టూరు నుంచి పరుచూరుకు మారి విజయం సాధించి ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1989 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. దగ్గుబాటి మాత్రం పరుచూరు నుంచి తన సీటు నిలబెట్టుకొన్నారు. 1991 ఎన్నికల్లో బాపట్ల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

1996లో టీడీపీ దగ్గుబాటిని రాజ్యసభకు పంపింది. 2002 వరకు ఆయన ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల ముందు దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో పరుచూరు నుంచి దగ్గుబాటి, బాపట్ల లోక్‌సభ నుంచి పురంధీశ్వరి గెలిచారు. 2009లో దగ్గుబాటి మళ్లీ పరుచూరు నుంచే ఎన్నికయ్యారు. పురందేశ్వరి విశాఖపట్నం ఎంపీగా గెలుపొందారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో దగ్గుబాటి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. పురందేశ్వరి సైతం కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, 2014, మార్చి 7న బీజేపీలో చేరారు. టీడీపీతో పొత్తులో భాగంగా రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు.

కాగా, 2014 ఎన్నికల్లో పరుచూరు నుంచి టీడీపీ అభ్యర్థి గా ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. దీంతో నియోజకవర్గంలో తమకు రాజకీయ వారసత్వం లేకుండాపోయిందని ఆందోళన చెందిన దగ్గుబాటి అమెరికాలో స్థిరపడిన తన కుమారుడు హితేశ్‌ చెంచురామ్‌ను వైసీపీ తరఫున పోటీ చేయించాలనుకున్నారు. కానీ హితేష్ అమెరికా పౌరసత్వం కలిగి ఉండడంతో పోటీకి దిగటానికి వీలుకాలేదు. దీంతో దగ్గుబాటే స్వయంగా బరిలో నిలవాల్సి వచ్చింది.

మరోవైపు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి దగ్గుబాటి పురంధీశ్వరిని బీజెపీ తన అభ్యర్ధిగా ప్రకటించింది. ఇటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ తరపున అసెంబ్లీకి అటు పురంధీశ్వరి బీజెపీ తరపున లోక్ సభకు పోటీకి దిగడం ద్వారా ఏపీ, భారత రాజకీయాలలో తమ ఉనికిని కాపాడుకోడానికి ఒకే కుటుంబం రెండు పార్టీల వ్యూహాన్ని తమ బాటగా ఎంచుకొన్నారు. ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.


Next Story