తీవ్ర పెను తుపానుగా మారిన ఫోనీ...ఉత్తరాంధ్రలో మొదలైన ఫోనీ తుపాను ప్రభావం

తీవ్ర పెను తుపానుగా మారిన ఫోనీ...ఉత్తరాంధ్రలో మొదలైన ఫోనీ తుపాను ప్రభావం
x
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన పోనీ తుపాను తీవ్ర రూపం దాల్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర పెనుతు పానుగా కొనసాగుతున్న ఫోనీ క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం...

బంగాళాఖాతంలో ఏర్పడిన పోనీ తుపాను తీవ్ర రూపం దాల్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర పెనుతు పానుగా కొనసాగుతున్న ఫోనీ క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గడిచిన ఆరు గంటలుగా 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.

ఒడిశాలోని పూరీకి 660 కిలోమీటర్లు, విశాఖకు 400 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 454 కిలోమీటర్ల దూరంలో ఫోనీ తుపాను కేంద్రీకృతమై ఉంది. తుపాను మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఎల్లుండి మధ్యాహ్నాం ఒడిశాలోని పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 205 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్రలో ఫోనీ తుపాను ప్రభావం అప్పుడే కనిపిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులతో కూడి వర్షం కురుస్తోంది. రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఫోనీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్ష పాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

తుపాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంట‌కు 90 నుంచి వంద కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అన్ని ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

శ్రీకాకుళం జిల్లాలో గార‌, ఇచ్ఛాపురం, క‌విటి, కంచిలి, సోంపేట‌, మంద‌స‌, సంత‌బొమ్మాళి, ప‌లాస‌, పొలాకి, నందిగాం, వ‌జ్రపుకొత్తూరు, శ్రీకాకుళం మండలాల్లో ఫోనీ తుపాను ప్రభావం అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురం, చీపురుప‌ల్లి, డెంకాడ‌, గ‌రివిడి, గుర్ల‌, నెల్లిమ‌ర్ల‌, పూస‌పాటిరేగ‌, విశాఖ జిల్లాలో భీమునిప‌ట్నం మండలంలో ఫోనీ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories