ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల్లో సంచలనం

ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల్లో సంచలనం
x
Highlights

లండన్‌లో జరిగిన ఈవీఎం హ్యాకథాన్‌లో అమెరికా సైబర్ నిపుణులు సయ్యద్ సుజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్...

లండన్‌లో జరిగిన ఈవీఎం హ్యాకథాన్‌లో అమెరికా సైబర్ నిపుణులు సయ్యద్ సుజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వెల్లడించారు. రిలయెన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సాయంతో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారని సుజా ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే మరణానికి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు లింక్ ఉందని ఆరోపించారు.

భారతదేశంలో 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అమెరికా సైబర్ నిపుణులు సయ్యద్ సుజా ఆరోపించారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్,రాజస్థాన్, చత్తీస్ గడ్, ఢిల్లీ ఫలితాలను రిగ్గింగ్ చేయడం జరిగిందని సుజా తెలిపారు. మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీని విడుదల చేసి మాడ్యులేటర్‌తో ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని లండన్‌లో జరిగిన ఈవీఎం హ్యాకథాన్‌లో సయ్యద్ సుజా తెలిపారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సాయంతో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారని షుజా ఆరోపించారు. 2009 నుంచి 2014 వరకు తాను ఈసీఐఎల్ సంస్థలో పనిచేశానని సయ్యద్ సుజా తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను రూపొందించిన బృందంలో తాను సభ్యుడిగా పనిచేసినట్లు సుజా తెలిపారు. లోక్‌సభ ఎన్నికలలో వాడిన ఈవీఎంల నుంచి సిగ్నల్స్ వస్తున్నట్లు తాను ఏప్రిల్ 2014లో గుర్తించినట్లు సుజా వెల్లడించారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని బాంబు పేల్చిన సైబర్ నిపుణులు సయ్యద్ సుజా ఈ కుట్రకు కేంద్రం హైదరాబాద్‌ అని చెప్పి మరో బాంబు పేల్చారు. ఈవీఎంల నుంచి సిగ్నల్స్ వస్తున్న రహస్యాన్ని గుర్తించిన తమ బృందం బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించిందని తెలిపారు. హైదరాబాద్‌లో శివార్లలో ఒక బీజేపీ నేత ఇంటికి తమ బృందం వెళ్లిందని అక్కడ తమపై కాల్పులు జరిగాయని వివరించారు. తాను కాల్పుల నుంచి తప్పించుకుని గాయాలతో బయటపడ్డానని తెలిపారు. ఈ కాల్పుల ఘటనను కప్పిపుచ్చేందుకు హైదరాబాద్‌లోని కిషన్‌గడ్‌లో మత కల్లోలాలు, హింసాకాండ్ సృష్టించారని సయ్యద్ సుజా వివరించారు. తన బృందంలోని ఇతర సహచరులను ఆ హింసలో చనిపోయినట్లు చూపించారని సయ్యద్ సుజా ఆరోపించారు.

బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే మరణానికి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు లింక్ ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి కథనం ప్రచురించాలనుకున్న జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను హత్య చేశారని షుజా ఆరోపించారు. సయ్యద్ సుజా వెల్లడించిన విషయాలను కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఖండించారు. కాంగ్రెస్ కుట్రలో భాగంగానే ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చిందని నఖ్వీ అన్నారు. ఈ చర్యతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ ముందుగానే అంగీకరించినట్లైందన్నారు.

భారత్‌లో 2014లో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా లండన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించడంపై భారత ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. అనుమానాలు అనవసరమంటూ ఆరోపణలపై చట్టపరమైన చర్యలకు సన్నద్ధమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నత ప్రమాణాలతో, కట్టుదిట్టమైన భద్రత, నిఘా మధ్య తయారైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై అనుమానాలు అనవసరమని స్పష్టం చేసింది. ఈవీఎంలపై అనుమానాలు రేకెత్తిస్తూ తమను లక్ష్యం చేసుకోవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 2010లో నియమితులైన సాంకేతిక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో వీటిని తయారు చేశామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories