సికార్ సభ సాక్షిగా కాంగ్రెస్ పై మోడీ సర్జికల్ స్ట్రైక్

సికార్ సభ సాక్షిగా కాంగ్రెస్ పై మోడీ సర్జికల్ స్ట్రైక్
x
Highlights

అయిదో దశ ఎన్నికల ప్రచారంలో దేశ భక్తి అంశం ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. సాక్షాత్తు ప్రధాని మోడీయే పాకిస్థాన్ చుట్టూ తన ప్రసంగాన్ని తిప్పడం ద్వారా...

అయిదో దశ ఎన్నికల ప్రచారంలో దేశ భక్తి అంశం ఎన్నికల ఎజెండాగా మారిపోయింది. సాక్షాత్తు ప్రధాని మోడీయే పాకిస్థాన్ చుట్టూ తన ప్రసంగాన్ని తిప్పడం ద్వారా సైనికు కుటుంబాలు ఎక్కువ ఉండే రాజస్థాన్ లో ఓటు బ్యాంకును గురిపెట్టారు. పదే పదే పాకిస్థాన్ ను, కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యోక్తులు, ఘాటైన విమర్శలు చేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్ లో ప్రచారం చేస్తున్న మోడీ మరోసారి దేశ భక్తిని, పాకిస్థాన్ ని ఎన్నికల అస్త్రంగా మలచుకున్నారు. తమను గెలిపిస్తే నదీ జలాలను పాకిస్థాన్ కు మళ్ల కుండా అడ్డుకుంటామన్నారు. భారత జలవనరుల హక్కులను కాపాడుతామన్నారు. ప్రధాని ప్రసంగం ఆద్యంతం కాంగ్రెస్ పై విమర్శలతో సాగింది. తన రాకకోసం మండుటెండల్లోనూ ఎదురు చూసిన ప్రజలకు అభినందనలు తెలిపారు. అంతలోనే అభినందన్ అని ప్రస్తావించినందుకు కాంగ్రెస్ ఈసీకి కంప్లయింట్ చేస్తుందని వ్యంగ్యంగా అన్నారు.

భారత్ కు హక్కుగా వచ్చే నీటి వనరులను కూడా యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్ కు కట్టబెట్టిందంటూ మండి పడ్డారు. తమను గెలిపిస్తే మే 23నుంచే పాకిస్థాన్ కు పారుతున్న నీళ్లని భారత రైతుల పొలాలకు మళ్లుతాయన్నారు. భారత భద్రతాధికారులను గూండాలు, అబద్ధాలకోర్లని తిట్టిన ఘనత కాంగ్రెస్ దన్నారు. సైన్యంలోకి పూట గడవని వారు మాత్రమే వస్తారంటూ సైనికులను ఎద్దేవా చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. రాజస్థాన్ నేల తమ ప్రజలకు రెండుపూటలా తిండి పెట్టలేనంత దీనస్థితిలో ఉందా అని ప్రశ్నించారు.

ఎన్నికలు తొలి నాలుగు దశల్లో తమకు ఓట్లు పడలేదని తెలుసుకున్న కాంగ్రెస్ కొత్త నాటకానికి తెర తీసిందన్నారు. తమ హయాంలో ఆరు సర్జికల్ దాడులు జరిపినట్లు యూపీఏ చెప్పుకుంటోందని మొదట్లో తమ ప్రభుత్వ దాడులను విమర్శించారనీ దుయ్యబట్టారు. తాము జరిపిన దాడులకు ప్రజలనుంచి మద్దతు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ కూడా మేమూ చేశామని ప్రచారం మొదలు పెట్టిందన్నారు. సర్జికల్ దాడులంటే కాంగ్రెస్ వీడియో గేములనుకుంటోందా అని ప్రశ్నించారు..

సికార్ ఎన్నికల ర్యాలీలో మరోసారి బాలాకోట్ దాడులను ప్రస్తావించారు. మే 23న ఫలితాలొచ్చాక తాము ఆరు సార్లు కాదు 16 సార్లు సర్జికల్ దాడులు చేశామని చెప్పినా ఆశ్చర్యం లేదన్నారు. అబద్ధాల కోరు కాంగ్రెస్ మాటలకు విలువే లేదన్నారు. యుద్ధంలో నేలకొరిగిన అమర వీరులకు స్మారక మ్యూజియం కూడా కట్టలేని చిన్న మనసు కాంగ్రెస్ దని దెప్పి పొడిచారు. నేషనల్ వార్ మెమోరియల్ కట్టిన ఘనత తనదేనన్నారు. ఆర్మీలో ఎక్కువమంది రాజస్థానీ యువకులు ఉంటారన్న కారణంగా మోడీ తన ప్రసంగాన్ని పూర్తిగా దేశ భద్రత, పాకిస్థాన్, బాలాకోట్ దాడులు తదితర అంశాల చుట్టూ తిప్పారు.


Show Full Article
Print Article
Next Story
More Stories