ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతోన్న కాంగ్రెస్

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగుతోన్న కాంగ్రెస్
x
Highlights

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపాలని టీ.కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తులు ప్రారంభించింది. టీఆర్ఎస్ 5 స్థానాలపై...

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలపాలని టీ.కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తులు ప్రారంభించింది. టీఆర్ఎస్ 5 స్థానాలపై కన్నేయడంతో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా హస్తం నేతలు ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలపై దృష్టిసారించింది. పార్టీల బలబలాలు, గెలుపోటములపై లెక్కలేసిన హస్తం పార్టీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు రెడీ అయ్యింది. పార్టీల సంఖ్యాబలం ప్రకారం టీఆర్‌ఎస్‌కి కేవలం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునే అవకాశమే ఉంది. కానీ, 5వ స్థానానికి కూడా మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది.

అసెంబ్లీలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకొని మొత్తం సభ్యుల సంఖ్య 120 ఉండగా అందులో టీఆర్‌ఎస్ సంఖ్య ఇటీవల పార్టీలో చేరిన స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 91కి చేరింది. మిత్రపక్షం ఎంఐఎంకు ఉన్న ఏడుగురితో కలిపితో 98. ఇక కాంగ్రెస్‌కు 19 మంది, టీడీపీకి ఇద్దరు, బీజేపీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అయితే, బీజేపీ తటస్తంగా ఉండే అవకాశం కనిపిస్తుండగా, టీడీపీ సభ్యుల్లో ఒకరు కాంగ్రెస్‌కు, మరొకరు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కల ప్రకారం కాంగ్రెస్‌‌కు 20 మంది ఉన్నట్టే.

ఇక ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ఒక్కో ఎమ్మెల్సీకి 21 మంది ఓటు అవసరం. కానీ, టీఆర్‌ఎస్‌ చెప్పినట్టు ఎంఐఎం అభ్యర్థిని పోటీలో నిలిపితే మాత్రం ఐదో అభ్యర్థికి 7ఓట్లు తగ్గుతాయి. కాంగ్రెస్‌కు 20 మంది ఉన్నందున ఎలిమినేషన్ పద్ధతిలో టీఆర్‌ఎస్ నిలిపే 5వ అభ్యర్థి మొదటి ప్రయార్టీ ఓట్లలోనే ఎగిరిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడమో, గైర్హాజరు కావడం కానీ జరిగితేనే 5వ స్థానం దక్కుతుంది. ఇప్పుడిదే కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది.

అయితే, కాంగ్రెస్ తమ అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది. ఎవరైతే ఎమ్మెల్యేలందరి ఆమోదం లభిస్తుందన్న లెక్కలు వేస్తోంది. పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, ప్రొటోకాల్ వేణుగోపాల్‌రెడ్డి పేర్లతో రాష్ట్ర నాయకత్వం ఓ జాబితాను కేంద్రానికి పంపింది. ఈ నెల 28వరకూ నామినేషన్లకు గడువు ఉండటంతో అభ్యర్థి ఎంపికకు కొంత సమయం పడుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్న కాంగ్రెస్ మరి ఆ ఒక్కస్థానాన్నైనా దక్కించుకుంటుందా..? లేక పరాజయాన్ని చవిచూస్తుందా అన్నది వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories