పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలు..

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలు..
x
Highlights

గులాబీ గూటికి చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలొచ్చిపడ్డాయి. పార్టీ ఎందుకు మారారన్న ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. వారి ప్రశ్నలకు...

గులాబీ గూటికి చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలొచ్చిపడ్డాయి. పార్టీ ఎందుకు మారారన్న ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న ఎమ్మెల్యేలపై ప్రజలు దాడులకు దిగుతున్నారు. దీంతో అటు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్‌లోకి వెళ్లలేక, ఇటు తమను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సర్ధిచెప్పుకోలేక సతమతమవుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా వేరే పార్టీ ఎమ్మెల్యేలను కారెక్కించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ఆ పార్టీని టీఆర్‌ఎస్‌ ఎల్పీలో విలీనం చేసుకోగా తాజాగా కాంగ్రెస్ పార్టీపై దృష్టిపెట్టారు కేసీఆర్.

ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. వారిలో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే గులాబీ గూటికి చేరిపోగా మిగిలిన వారికోసం వేట కొనసాగుతోంది. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కాంగ్రెస్ హైకమాండ్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలను నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీంతో ఎక్కడికక్కడే వారిని జనం నిలదీస్తున్నారు.

తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై గ్రామస్తులు దాడికి దిగారు. పార్టీ మారడంపై గ్రామస్తులు పెద్దఎత్తున నిరసనలు తెలియజేశారు. ఎన్నికలకు ముందు ప్రాణం పోయినా పార్టీ మారనని ఇచ్చిన హామీ ఏమైందని ఆమెను నిలదీశారు. మరోవైపు పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావుకు కూడా ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. బూర్గంపహాడ్ మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంతారావును పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందని జనం నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేశారు. ఇలా పార్టీ ఫిరాయింపుదారులకు గ్రామాల్లో చేదు అనుభవం ఎదురవడంతో ప్రచారానికి వెళ్లాంటే భయపడిపోతున్నారు. మరి భవిష్యత్‌లో ప్రజా వ్యతిరేకతను పార్టీ ఫిరాయించిన ఎమ్యెల్యేలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories