ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌లు

ఎన్నికల వేళ టీ కాంగ్రెస్‌కు ఊహించని షాక్‌లు
x
Highlights

షాక్.. షాకుల మీద షాక్.. దెబ్బ.. దెబ్బమీద దెబ్బ.. ఈ పదాలు ఆ పార్టీ బాగా అలవాటైపోయాయి ఏ క్షణం ఏమౌతుందో తెలియదు ఎవరు ఆ హ్యాండుకి హ్యాండిస్తారో తెలియదు...

షాక్.. షాకుల మీద షాక్.. దెబ్బ.. దెబ్బమీద దెబ్బ.. ఈ పదాలు ఆ పార్టీ బాగా అలవాటైపోయాయి ఏ క్షణం ఏమౌతుందో తెలియదు ఎవరు ఆ హ్యాండుకి హ్యాండిస్తారో తెలియదు నిన్నటి వరకూ పార్టీ విధేయులు, వీరాభిమానులు నేడు పార్టీ వేస్ట్ అంటూ వదిలేస్తున్నారు. రాజీనామాలు, జంప్ జిలానీలతో విలవిల లాడుతోంది కాంగ్రెస్. శతాధిక పార్టీకి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?

తెలంగాణలో కాంగ్రెస్ ఎదురు దెబ్బలు తినడం కొత్తేమీ కాదు తెలంగాణ ఇచ్చాం తెలంగాణ తెచ్చాం అని 2014 ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ 2018 అసెంబ్లీ పోరులోనూ ఘోరంగా ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు 10 మంది పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఇందులో సీనియర్ నేతలుగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డితో పాటు తొలిసారి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్‌లో అధికారికంగా చేరకపోయినా పార్టీని వీడుతున్నట్టు స్పష్టంగా ప్రకటించారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్‌లో విలీనమయ్యే అవకాశాలున్నాయి.

ఇలాంటి సమయంలో పార్టీలో అత్యున్నత స్ధానంలో ఉండి కీలక నేతలుగా ఉన్న పలువురు నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. మాజీమంత్రి, సీనియర్ నేత డీకే అరుణ ఇప్పటికే పార్టీని వీడి బీజేపీలో చేరారు. మహబూబ్ నగర్ నుంచి బీజేపీ తరపున ఆమె పోటీకి దిగారు. అయితే బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలను ఆకర్షిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ను రీప్లేస్‌ చేసి, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వలసలను బీజేపీ ప్రోత్సహిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే సీనియర్లను వరుసపెట్టి, పార్టీలోకి ఆహ్వానించడమని చెబుతున్నారు. తాజాగా సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కాడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ కమర్షియల్‌ పార్టీగా మారిందంటూ విమర్శించిన పొంగులేటి దేశ భద్రత విషయంలో కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు.

మొత్తానికి పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఇటు సీనియర్ నేతలు పక్క చూపులు చూస్తూ ఉండటంతో పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం అటు అధిష్టానం ఇటు కేడర్‌లో ఆందోళన కలుగుతోంది. అయితే, జరుగుతున్న పరిణామాలను చేష్టలుడిగి చూస్తున్న కాంగ్రెస్ హైకమాండ్, నష్టనివారణ చర్యలు చేపట్టడంలో విఫలమవుతోంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న నేతల వలసలను ఆపడంలో, ఉన్నవారిలో భరోసా కలిగించడంలో ఫెయిల్‌ అవుతోంది. ఇలాగే కీలక నేతలు జారిపోతే, ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే కనుమరుగు కావడం ఖాయమని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా హైకమాండ్‌లో సమర్థులైన నేతలు రంగంలోకి దిగాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories