సంపద, సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో...ఆచరణ సాధ్యంపైనే ఎన్నెన్నో అనుమానాలు

సంపద, సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ మేనిఫెస్టో...ఆచరణ సాధ్యంపైనే ఎన్నెన్నో అనుమానాలు
x
Highlights

దేశంలో ఎన్నికల రాజకీయం రోజురోజుకూ పుంజుకుంటోంది. తాజాగా మేనిఫెస్టోలను ప్రకటించడం కూడా మొదలైంది. ఈ విషయంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. హమ్ నిభాయేంగే అంటూ ...

దేశంలో ఎన్నికల రాజకీయం రోజురోజుకూ పుంజుకుంటోంది. తాజాగా మేనిఫెస్టోలను ప్రకటించడం కూడా మొదలైంది. ఈ విషయంలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. హమ్ నిభాయేంగే అంటూ కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. కాంగ్రెస్ వాగ్దానాల చిట్టా పెద్దగానే ఉంది. మరి ఆ వాగ్దానాలను అమలు చేయడం సాధ్యమా అనే విషయంలోనే పలు సందేహాలున్నాయి. అసలు సమస్య అది కూడా కాదు దేశభద్రతకు సంబంధించిన కొన్ని అంశాల ప్రస్తావన, కశ్మీరీ పండిట్ల లాంటి కొన్ని అంశాలను విస్మరించడంపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ఇంతకూ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉంది? బీజేపీ భయపెడుతున్నట్లుగా అది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా ఉందా? దేశాన్ని ముక్కలు చేసేదిగా ఉందా ? ఉగ్రవాదులకు అండగా నిలిచేదిగా ఉందా ? లాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

మేనిఫెస్టో ఎంతో అధునాతనంగా అనిపించే ఈ పదం 400 ఏళ్ళుగా ఇంగ్లీషులో వాడుకలో ఉంది. ఇటలీ భాష నుంచి ఈ పదం పుట్టింది. మరెన్నో వందల ఏళ్ళ నుంచే లాటిన్ లో వ్యవహారంలో ఉంది. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అంటారు. అదే విధంగా అన్ని దానాల్లోకి సులభమైంది వాక్ దానం అదే వాగ్దానం. అలాంటి వాగ్దానాల సమాహారమే మేనిఫెస్టో. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో ఆ పార్టీకి మేలు చేసే విషయం ఎలా ఉన్నా ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి మాత్రం సరికొత్త ప్రచారాస్త్రాలను అందించింది.

తాము అధికారం లోకి వస్తే 1870 సెడిషన్ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో లో ప్రకటించడం సంచలనం కలిగించింది. బ్రిటిష్ హయాం నాటి ఈ చట్టం దేశంలో రాజకీయ అసమ్మతిని అణచివేసేందుకు అధికారపక్షం ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నదని ఉద్యమకారులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టం కింద అరెస్టయిన దాఖలాలు ఉన్నాయి. విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ అరెస్టయింది ఈ చట్టం కిందనే. ఈ చట్టం సద్వినియోగం కన్నా దుర్వినియోగమే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ భావించింది. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ లో సెక్యూరిటీ అవసరాలు, మానవ హక్కుల పరిరక్షణ మధ్య సమతుల్యత సాధిస్తామని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ లో సాయుధ దళాలకు గల ప్రత్యేక అధికారాలను తొలగిస్తామని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశంలో పెరిగిపోతున్న మావోయిజం, ఉగ్రవాద సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ మేనిఫెస్టో లోని ఈ అంశాలు జాతీయవాదులకు అంతగా మింగుడుపడవనే చెప్పవచ్చు. మరో వైపు సామాజిక ఉద్యమకారులు మాత్రం ఈ వాగ్దానాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఏదైనా సరే చట్టాలను దుర్వినియోగం చేస్తే ఆ చట్టాలపై ప్రజలకు సదభిప్రాయం పోయే అవకాశం ఉంది. ఈ పరిణామం కఠిన చట్టాల రద్దుకు దారి తీస్తే అంతిమంగా అది దేశభద్రతకు ముప్పు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. దేశాన్ని ముక్కలు చేస్తామనే నినాదాలు గనుక కార్యరూపం దాలిస్తే ఆ పరిస్థితి ఊహించుకోవడానికే భయం వేస్తుంది. ఉగ్రవాదం లాంటి అంశాలపై దేశంలో జాతీయ విధానం లేని లోటును కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టం చేస్తోంది.

కాంగ్రెస్ మేనిఫెస్టో పై బీజేపీ విమర్శలు దేశంలో సరికొత్త చర్చకు తెరదీశాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను దేశానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమైందిగా బీజేపీ అభివర్ణించింది. దేశాన్ని ముక్కచెక్కలు చేసే ఎజెండాతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని బీజేపీ విమర్శించింది. జిహాదీలు, మావోయిస్టుల ఉక్కు కౌగిలిలో కాంగ్రెస్ చిక్కుకుందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం దేశద్రోహం ఇక ఎంతమాత్రం నేరంకాకుండా పోతుందని వ్యాఖ్యానించింది. జిహాదీలు, మావోయిస్టులను కాపాడేలా భద్రతాదళాలను ప్రాసిక్యూట్ చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని బీజేపీ విమర్శించింది. కశ్మీరీ పండిట్లను కశ్మీర్ కు దూరం చేయడాన్ని ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టింది. అవగాహనరాహిత్యంతో కాంగ్రెస్ పలు అంశాల్లో వాగ్దానాలను చేసిందని బీజేపీ విమర్శించింది. నిజానికి ఇలాంటి అంశాలు సాధారణమైనవేమీ కాదు. ఆర్థికపరంగా, భద్రతపరంగా, సామాజికపరంగా వివిధ అంశాల్లో దేశానికి జాతీయ విధానాలు ఉండాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జాతీయ విధానాల నుంచి వైదొలిగే విధంగా వాగ్దానాలు ఉండకూడదు. అందుకే కాంగ్రెస్ మేనిఫెస్టో పై గతంలో ఎన్నడూ లేనంత చర్చ ఇప్పుడు జరుగుతోంది. బీజేపీ మేనిఫెస్టో, వామపక్షాల మేనిఫెస్టోలు, ప్రాంతీయ పార్టీల మేనిఫెస్టోలు కూడా ప్రజల ముందుకు వస్తే ఆయా పార్టీల తీరుతెన్నులపై ప్రజలు ఒక అవగాహనకు వచ్చేందుకు వీలవుతుంది.

సంపద, సంక్షేమానికి కాంగ్రెస్ మేనిఫెస్టో పెద్దపీట వేసింది. సమాజంలోని అన్ని వర్గాలకూ ఏదో ఒక మేలు చేసే ప్రయత్నం చేసింది. హెవీ ఇంటర్నెట్ ట్రాఫిక్ తో పార్టీ వెబ్ సైట్ క్రాష్ కావడమే కాంగ్రెస్ మేనిఫెస్టో సృష్టించిన సంచలనానికి ఒక నిదర్శనం. అలా చేయడంలో అది తప్పటడుగులూ వేసిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

విద్యకు జీడీపీలో ఆరు శాతం నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించడం కూడా వివాదానికి దారి తీసే అంశమే. గతంలో ఇది మూడు శాతానికి మించలేదు. ఒక్కసారిగా దాన్ని ఆరు శాతానికి పెంచడం ఇతర రంగాల కేటాయింపులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక రైతురుణమాఫీ, కనీస ఆదాయ పథకం లాంటివన్నీ కూడా భారీ ఖర్చుతో కూడుకున్నవే. వాటి అమలు విషయంలో ఆర్థిక నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి రైతుల కోసం ఎలాంటి కొత్త పథకాలు అవసరం లేదు స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు చేస్తే చాలు. మరో వైపున సంక్షేమ పథకాలు, జనాకర్షక పథకాల మధ్య సరిహద్దు రేఖ పలుచనైపోతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలు జనాకర్షక పథకాలుగానే ఉన్నాయి. లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. మహిళలకు ఉద్యోగాలు అందించే ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాల యోచన మహిళాసాధికారికతకు దోహదం చేసే అవకాశం ఉంది.

అధికారం పొందడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయపార్టీలు ఎంతకైనా తెగిస్తుంటాయి. ఎలాంటి వాగ్దానాలైనా చేస్తుంటాయి. అందుకే పదేళ్ళ క్రితమే సుప్రీం కోర్టు కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ విషయంలో ఆయా పార్టీలతో చర్చించి కొన్ని మార్గదర్శకాలను తయారు చేయాల్సిందిగా అప్పట్లో సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. రాజకీయ పార్టీలు మాత్రం ఎలాంటి వాగ్దానాలనైనా చేసే హక్కు తమకు ఉందని వాదించాయి. ఎన్నికల సంఘం కూడా సూత్రప్రాయంగా దాన్ని అంగీకరించినప్పటికీ కొన్ని వాగ్దానాలు కొన్ని సందర్భాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అడ్డంకిగా ఉంటాయని భావించింది. అందుకే ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం పార్టీలు చేసే వాగ్దానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఉండాలి. పార్టీలు చేసే వాగ్దనాలు తగిన ఆర్థిక సమాచారంతో ఆచరణసాధ్యంగా ఉండాలి. నెరవేర్చేందుకు సాధ్యం కాని హామీలను ఆయా పార్టీలు ఇవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని హామీలు ఆచరణసాధ్యం కావని అంత తేలిగ్గా చెప్పలేం. ప్రముఖ ఆర్థిక నిపుణులు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో పాల్గొన్నారు. అదే సమయంలో ఆ హామీలను అమలు చేయాలంటే మరెన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పణంగా కూడా పెట్టాల్సి ఉంటుంది. ఏమైతేనేం వివిధ అంశాల్లో నిర్దిష్టంగా ఒక జాతీయ విధానం ఉండాల్సిన ఆవశ్యకతను కాంగ్రెస్ మేనిఫెస్టో మరోసారి వెలుగులోకి తీసుకువచ్చింది. వివిధ పార్టీలు విభిన్న దృక్పథాలను అనుసరించడం దీర్ఘకాలిక దృష్టితో చూస్తే దేశానికి చేటు తెచ్చేదిగా ఉంటుంది. జాతీయ విధానాల రూపకల్పనకు పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అలా జరిగినప్పుడే దేశం ఎలాంటి తడబాటు లేకుండా ఆయా విధానాల అమల్లో ముందుకు వెళ్ళగలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories