Top
logo

పోలీసులు..మంత్రి అఖిలప్రియ మధ్య కోల్డ్ వార్...రోజురోజుకు ముదురుతున్న వ్యవహారం

akhila priya
X
akhila priya
Highlights

పోలీసులతో మంత్రి అఖిలప్రియ కోల్డ్ వార్ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. అక్క బాటలోనే ఆమె సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి నడిచారు.

పోలీసులతో మంత్రి అఖిలప్రియ కోల్డ్ వార్ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. అక్క బాటలోనే ఆమె సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి నడిచారు. పోలీస్ సెక్యూరిటీని ఆయన దూరంగా పెట్టారు. మరోవైపు అఖిల ప్రియ తీరును హోం మంత్రి చినరాజప్ప తప్పుపట్టడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.

కొద్ది రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. టీడీపీ నాయకుల ఇళ్లలో కూడా తనిఖీలు చేశారు. పోలీసులు టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ సోదాలు చేశారని ఆరోపిస్తూ మంత్రి అఖిల ప్రియ గన్ మెన్లన్ సరెండర్ చేశారు.

సెక్యూరిటీని దూరం పెట్టి నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో మంత్రి అఖిల ప్రియ పాల్గొంటున్నారు. దీనిపై పోలీసులు, టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తనకు ఎలాంటి భయంలేదని, తన అనుచరులకు రక్షణ లేనప్పుడు తనకెందుకు అని అఖిల ప్రియ ప్రశ్నిస్తున్నారు.

ఈ వ్యవహారంలో అఖిలప్రియకు ఆమె సోదరుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మద్దతుగా నిలిచారు. అఖిలప్రియ గన్ మెన్లను పక్కనబెట్టిన మూడు రోజుల తర్వాత బ్రహ్మానంద రెడ్డి కూడా గన్ మెన్లను దూరం పెట్టి జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. తనకు కూడా పోలీస్ రక్షణ అవసరంలేదని స్పష్టం చేశారు.

అఖిల ప్రియ వ్యవహారంపై స్పందించిన హోంమంత్రి చినరాజప్ప అగ్గిరాజేసే వ్యాఖ్యలు చేశారు. అఖిల ప్రియ తీరును తప్పుపడుతూ పోలీసులకు బాసటగా నిలిచారు. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి ఫరూక్, టీడీపీ నేతలు నోరుమెదపకపోవడంపై భూమా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూమా ఫ్యామిలీ కర్నూల్ పోలీసుల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఏ దశకు వెళుతుందోనని టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.

Next Story