Top
logo

నేడు నిర్మల్‌లో సీఎం సభ.. టార్గెట్‌ కేంద్రంగా

నేడు నిర్మల్‌లో సీఎం సభ.. టార్గెట్‌ కేంద్రంగా
Highlights

ప్రచారానికి రెండు రోజులు బ్రేక్ ఇచ్చిన కేసీఆర్‌ మరోసారి రంగంలోకి దిగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న ...

ప్రచారానికి రెండు రోజులు బ్రేక్ ఇచ్చిన కేసీఆర్‌ మరోసారి రంగంలోకి దిగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ నిర్మల్‌ కేంద్రంగా నిర్వహించనున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభను విజయవంతం చేసేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారు.

ప్రచారానికి రెండు రోజులే మిగిలి ఉండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి కార్యక్షేత్రంలోకి దూకుతున్నారు. ఇప్పటివరకు 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 11 బహిరంగ సభల్లో పాల్గొన్న కేసీఆర్ మిగతా నియోజకవర్గాలను కవర్‌ చేసేలా ప్రణాళిక రూపొందించారు. రెండు రోజుల విరామం తర్వాత ఇవాళ నిర్మల్‌ కేంద్రంగా జరగనున్న భారీ బహిరంగసభలో పాల్గొంటారు. ఇందుకోసం ఎల్లపెల్లి రహదారి దగ్గర సభ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆదిలాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి గోడం నగేష్‌ను గెలుపు బాధ్యతను తీసుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌ సభను విజయవంతం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. భారీగా జనసమీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కావడంతో భారీ షామియానాలు వేస్తున్నారు. వచ్చే జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను మంత్రి పర్యవేక్షిస్తున్నారు.

16 ఎంపీ సీట్లే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్మల్‌ సోమవారం వికారాబాద్ జిల్లాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొననున్న కేసీఆర్ ఎప్పట్లాగే కేంద్రంపైనే విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం ఉంది. అలాగే గ్రేటర్‌ పరిధిలో కూడా కేసీఆర్ రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Next Story