ఏపీ, తెలంగాణల మధ్య డేటా చోరి చిచ్చు

ఏపీ, తెలంగాణల మధ్య డేటా చోరి చిచ్చు
x
Highlights

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ , తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు చోరికి...

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ , తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు చోరికి గురయ్యాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసింది. తమకు సేవలందిస్తున్న సంస్ధలపై ఉద్దేశ పూర్వకంగానే దాడులు చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు .

ఓటుకు నోటు కేసు తరువాత ఏపీ, తెలంగాణల మధ్య మరో వివాదం రాజకుంది. ఏపీలో పెద్ద ఎత్తున తమ మద్ధతుదార్లు ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ తాజాగా మరో అస్త్రాన్ని ఏపీ సర్కార్‌ పై ప్రయోగించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన లబ్ధిదారుల జాబితా కొన్ని ప్రయివేటు ఐటీ సంస్ధలు చోరి చేశాయంటూ ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సైబరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు ఐటీ సంస్ధల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్పసోసైటీలోని ఐటీ గ్రిడ్స్ సంస్ధలో ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెందిన ఆధార్‌, ఓటర్ కార్డులు బయటిపడినట్టు సమాచారం.

ఐటీ గ్రిడ్స్‌తో పాటు బ్లా ఫ్రాగ్ మోబైల్‌, ఉద్యం డేటా సెంటర్లలోనూ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ గ్రిడ్స్‌కు చెందిన ఉన్నతాధికారి భాస్కర్‌‌తో పాటు పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు హుటాహుటినా ఐటీ గ్రిడ్స్‌ సంస్ధ దగ్గరకు చేరుకుని తెలంగాణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏపీలోని అధికార పార్టీకి సేవలందిస్తున్న సంస్ధల్లో సోదాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్‌ పోలీసుల అదుపులో ఉన్నవారిని తమకు అప్పగించాలంటూ కోరారు. అయితే ఆధార్ లీకేజీ ఆరోపణలు ఉన్నందున అప్పగించలేమంటూ తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో వివాదం మరింత ముదిరింది.

ఐటీ సంస్ధల్లో సోదాలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు . తమ పార్టీకికి సేవలందిస్తున్న సంస్ధల్లో దాడులు నిర్వహించడం వెనక సీఎం కేసీఆర్ హస్తముందని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్‌కు మేలు చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పుకోక తప్పదంటూ హెచ్చరించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తనయుడు , మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. తమ పార్టీకి సేవలందిస్తున్న వారిని మోడీ సమేత కల్వకుంట్ల జగన్‌ కిడ్నాప్‌ చేస్తున్నారంటూ ట్వీట్‌ చేశారు. ఇలా చేసేందుకు సిగ్గు లేదా ? అంటూ ప్రశ్నించారు.

మరో వైపు ఈ వివాదంపై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారనడానికి ఇదే సాక్షమన్నారు. అటు టీడీపీ ఇటు వైసీపీల మధ్య రేగిన ఈ వివాదం హైదారబాద్ వేదికగా కొనసాగుతూ ఉండటంతో ఇరు ప్రభుత్వాల మధ్య మరోసారి చిచ్చు రగిలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories