కొత్త జీవితాన్ని ప్రారంభించాం: చంద్రబాబు

కొత్త జీవితాన్ని ప్రారంభించాం: చంద్రబాబు
x
Highlights

హైదరాబాద్‌ను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించామని, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకరిస్తే 20.. 30 ఏళ్లు పడుతుందని...

హైదరాబాద్‌ను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించామని, అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకరిస్తే 20.. 30 ఏళ్లు పడుతుందని చెప్పారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజల కోసమే తాను ఢిల్లీ వీధుల్లో పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటికైనా మోడీ, కేంద్రం స్పందించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. విభజన హామీలు సాధించే వరకూ తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతిని ఆయన కోరారు.

అంతకు ముందు సీఎంతో సహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకూ పాదయాత్రగా బయల్దేరి వెళ్లారు. తాము అన్ని రాష్ట్రాలతో సమాన స్థాయికి ఎదగాలంటే కనీసం 20 నుంచి 30 ఏళ్లు పడుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రం ఎంతో బాధ్యతారాహిత్యంగా, దుర్మార్గంతో ప్రవర్తించిందన్నారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కేసుల మాఫీ కోసం మోదీకి ఊడిగం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. మోడీ ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి మోసం చేసిందని, మోడీ ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్షతప్పదని చంద్రబాబు హెచ్చరించారు. తాను చేస్తోంది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని ప్రజా ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని చంద్రబాబు చెప్పారు.

మరోవైపు ఢిల్లీలో జరిగిన ధర్మపోరాట దీక్ష ప్లాప్ అనడం రాష్ట్ర ద్రోహమని సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 17 పార్టీల ప్రతినిధులు పాల్గొనడం ప్లాప్ షో నా..? లేక దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టడం ప్లాప్ షో నా..? అని సీఎం నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం దివ్యాంగుడు అర్జున్‌రావు ఆత్మహత్య చాలా బాధాకరమని, ఎవరూ ఇలాంటి సాహసానికి పూనుకోవద్దని హితవు పలికారు. ఢిల్లీలో రాబోయేది ఏపీకి హోదా ఇచ్చే ప్రభుత్వమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories