పలువురు మంత్రులకు చంద్రబాబు షాక్‌

పలువురు మంత్రులకు చంద్రబాబు షాక్‌
x
Highlights

టికెట్ల కేటాయింపులో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు షాకిస్తున్నారు. పలువురు మంత్రులకు సిట్టింగ్‌ సీట్లు నిరాకరిస్తున్న చంద్రబాబు ఎంపీలుగా పోటీ చేయాలని...

టికెట్ల కేటాయింపులో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు షాకిస్తున్నారు. పలువురు మంత్రులకు సిట్టింగ్‌ సీట్లు నిరాకరిస్తున్న చంద్రబాబు ఎంపీలుగా పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప పార్లమెంట్‌ నుంచి బరిలోకి దింపుతోన్న చంద్రబాబు అదే బాటలో పలువురు మంత్రులను కూడా లోక్‌సభకు పోటీ చేయాలని కోరుతున్నారు. దాంతో ఆయా మంత్రులు ఎటూతేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మంత్రులకైతే టికెట్‌‌పై అసలు హామీయే దక్కడం లేదని తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి శిద్ధా రాఘవరావును ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. దాంతో శిద్ధా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్న శిద్ధా ఒకవేళ తాను లోక్‌సభకు పోటీ చేయాల్సి వస్తే తన కుటుంబంలో మరో వ్యక్తికి దర్శి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఏపీ కేబినెట్‌లో కీలక మంత్రిగా ఉన్న గంటాను కూడా పార్లమెంట్ బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు. అనకాపల్లి లేదా విశాఖ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే గంటాను కోరినట్టు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ప్రతిపాదనపై గంటా కూడా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అసెంబ్లీకి పోటీ చేసేందుకే మొగ్గుచూపుతున్న గంటా లోక్‌సభ బరిలోకి దిగేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.

స్పీకర్ కోడెల శివప్రసాద్‌‌ కూడా ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది. నర్సరావుపేట లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని కోడెలను చంద్రబాబు కోరారట. అయితే నర్సరావుపేట లేదా సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే కోడెల మొగ్గుచూపుతున్నట్లు సమాచారం అందుతోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై నర్సరావుపేట సిట్టింగ్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు అసంతృప్తిలో ఉన్నారు. మళ్లీ తనకు నర్సరావుపేట ఎంపీ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్న రాయపాటి అలాగే తన కుమారుడు రంగబాబుకి సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే తమ డిమాండ్లను చంద్రబాబు పట్టించుకోవడం లేదని రాయపాటి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మరో మంత్రి కాల్వ శ్రీనివాస్‌‌కు టికెట్ కేటాయింపు అనుమానంగా మారింది. అలాగే మంత్రి జవహర్‌‌‌కు కూడా టికెట్‌పై భరోసా దక్కలేదని తెలుస్తోంది. అయితే అధినేత తీరుపై పలువురు మంత్రులు, నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories