Top
logo

చంద్రబాబు అసాధారణ నిర్ణయం...సిటింగ్ ఎమ్మెల్యేల్లో...

చంద్రబాబు అసాధారణ నిర్ణయం...సిటింగ్ ఎమ్మెల్యేల్లో...
X
Highlights

నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి అధికార టీడీపీ అభ్యర్థుల మార్పు వ్యూహంతో సిద్ధమయ్యింది. సిటింగ్ ఎమ్మెల్యేల...

నవ్యాంధ్రప్రదేశ్ ఎన్నికల సమరానికి అధికార టీడీపీ అభ్యర్థుల మార్పు వ్యూహంతో సిద్ధమయ్యింది. సిటింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో భారీగా మార్పులు చేర్పులు చేపట్టింది. అసెంబ్లీ బరి నుంచి ఐదుగురు మంత్రులను సైతం తప్పించి కొత్తముఖాలకు అవకాశం ఇచ్చింది.

రాజకీయం అంటేనే వ్యూహప్రతివ్యూహాల సమరం. ఎన్నికల ప్రచారం నుంచి అభ్యర్థుల ఎంపిక వరకూ ఆచితూచి అడుగువేయటం అనివార్యం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం ప్రధానపార్టీలన్నీ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలలో తలమునకలై ఉన్నాయి.

నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో అధికార టీడీపీ గతంలో ఎన్నడూ లేనంతగా తెగువను ప్రదర్శించింది. సిటింగ్ ఎమ్మెల్యేల్లో 43 శాతం మంది స్థానాలను మార్చింది. అంతేకాదు ఏకంగా 34 నియోజకవర్గాలలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున మొత్తం 102 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత ఇద్దరు స్వతంత్రులు, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. వీరితో కలిపి పార్టీ మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 127కి చేరింది. మొత్తం 127 స్థానాలలో 34 చోట్ల ప్రస్తుత ఎన్నికల్లో కొత్త అభ్యర్థులను పోటీకి దించారు. ఎమ్మెల్యేలు బలంగా ఉన్న ఒకటి లేదా రెండు స్థానాలను సైతం సమీకరణల కారణంగా మార్చారు.

రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు దర్శి నియోజకవర్గంలో బలంగా ఉన్నా ఆయన్ను ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించారు. అంతేకాదు జమ్మలమడుగు ఎమ్మెల్యే, మార్కెటింగ్‌ మంత్రి ఆదినారాయణరెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభను రాజంపేట లోక్‌సభకు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజును నరసాపురం లోక్‌సభకు నిలిపారు.

మంత్రులు సహా నలుగురు సిటింగ్‌ ఎమ్మెల్యేల సీట్లు మార్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలిని వదిలి విశాఖ నార్త్ నుంచి పోటీకి దిగుతున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ను కొవ్వూరు నుంచి తిరువూరుకు, పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను కొవ్వూరుకు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి మార్చారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సల్స్‌ హత్య చేయడంతో ఆయన కుమారుడు, గిరిజన సంక్షేమ మంత్రి శ్రావణ్‌కు ఆ టికెట్‌ కేటాయించారు.

పార్టీ నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో వేరే పార్టీల పంచన చేరారు. వీరిలో మాజీ మంత్రి. రావెల కిశోర్‌బాబు జనసేనలో చేరారు. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి , మేడా మల్లికార్జున్‌రెడ్డి , ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీ కండువాలు కప్పుకొన్నారు.

ఆ స్థానాలలో టీడీపీ కొత్త అభ్యర్థులను ఎంపిక చేసింది. అంతేకాదు ప్రస్తుత ఎన్నికల్లో అవకాశం దక్కని సిటింగ్ ఎమ్మెల్యేలలో గౌతు శివాజీ , కిమిడి మృణాళిని , మీసాల గీత , వరుపుల సుబ్బారావు , పులవర్తి నారాయణరావు, పీతల సుజాత , ముడియం శ్రీనివాసరావు , జలీల్‌ఖాన్‌ , డేవిడ్‌రాజు , ఎస్‌వీ మోహన్‌రెడ్డి , కేఈ కృష్ణమూర్తి , మణిగాంధీ , పరిటాల సునీత , యామినీబాల, హనుమంతరాయ చౌదరి , చాంద్‌బాషా , బొజ్జల గోపాలకృష్ణారెడ్డి , తలారి ఆదిత్య , కాగిత వెంకట్రావు , జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

పలాస, చీపురుపల్లి, విజయవాడ పశ్చిమ, పత్తికొండ, రాప్తాడు, శ్రీకాళహస్తి, పెడన, తాడిపత్రి స్థానాల్లో సీటు దక్కని సిటింగ్‌ ఎమ్మెల్యేలు తమ కుమారులు లేదా కుమార్తెలకు చోటు కల్పించుకోగలిగారు. మరోవైపు చంద్రబాబు మంత్రివర్గంలోని ఐదుగురు మంత్రులు ప్రస్తుత ఎన్నికల బరికి దూరంగా ఉండాలని నిర్ణయించారు.

ఎమ్మెల్సీగా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీకి పోటీ చేయడం లేదు. ఎమ్మెల్యేలుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మహిళా శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగి తమ కుమారులకు అవకాశం కల్పించారు. శిద్దా రాఘవరావు, ఆదినారాయణరెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిలో ఆరుగురికి సీట్లు దక్కలేదు. ఆ ఆరుగురిలో వరుపుల సుబ్బారావు, జలీల్‌ఖాన్‌, డేవిడ్‌రాజు, మణి గాంధీ, చాంద్‌బాషా, ఎస్‌వీ మోహన్‌రెడ్డి ఉన్నారు. గతంలో టీడీపీ ప్రాతినిథ్యం లేని 24 నియోజకవర్గాల నుంచి కొత్త ముఖాలను పోటీకి దించారు.

2014 ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పొందిన వారిలో 23 మందికి మరోసారి అవకాశం కల్పించారు. 24 స్థానాల్లో ఇన్‌చార్జులను కాదని కొత్త ముఖాలకే సీట్లు కేటాయించారు. మాజీ ఎంపీ సబ్బం హరి తొలిసారిగా టీడీపీ టికెట్‌పై భీమిలి నుంచి పోటీకి దిగారు. నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో డాక్టర్‌ అరవింద్‌ను బరిలోకి దించారు. ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులుకు కోడుమూరు సీటు దక్కింది. ఎంపీ టీజీ వెంకటేశ్‌ కుమారుడు టీజీ భరత్‌కు కర్నూలు సీటిచ్చారు. శింగనమలలో బండారు శ్రావణికి, విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితికి సీట్లు కేటాయించారు.

రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తటస్థులకు కొన్ని టికెట్లు కేటాయించడం తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో సైతం ఆ ఆనవాయితీని కొనసాగించారు. రామాంజనేయులు, అరవింద్‌, మాచర్ల బరిలో నిలిచిన పారిశ్రామికవేత్త అంజిరెడ్డికి మాత్రమే తటస్థుల కోటాలో సీట్లు సంపాదించుకోగలిగారు. మొత్తం మీద అభ్యర్ధుల ఎంపికలో టీడీపీ అనుసరించిన వ్యూహం ప్రతిపక్ష పార్టీలపై ఎలాంటి ప్రభావం చూపగలదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story