Top
logo

తమ్ముళ్లకు అన్నయ్య ప్రచారం చేస్తారా...చిరంజీవి స్పందనపై...

తమ్ముళ్లకు అన్నయ్య ప్రచారం చేస్తారా...చిరంజీవి స్పందనపై...
Highlights

చిన్న తమ్ముడు ఒక పార్టీ అధినేత. త్రిముఖ సమరంలో ప్రముఖంగా నిలబడతామంటున్న కొత్త పార్టీ అధ్యక్షుడు. రెండు స్థానాల ...

చిన్న తమ్ముడు ఒక పార్టీ అధినేత. త్రిముఖ సమరంలో ప్రముఖంగా నిలబడతామంటున్న కొత్త పార్టీ అధ్యక్షుడు. రెండు స్థానాల నుంచి పోటీ చేస్తానంటున్నారు. అటు పెద్ద తమ్ముడు నరసాపురం లోక్‌సభ బరిలో దిగుతూ, తొలిసారి రాజకీయక్షేత్రంలోకి అడుగుపెడుతున్నారు. మరి పెద్దన్నయ్య ఆశీస్సులు తమ్ముళ్లకు ఉంటాయా? బ్రదర్స్‌ పోటీ చేసే స్థానాల్లోనైనా, ప్రచారం చేస్తారా? వారి గెలుపుకు కృషి చేస్తారా? అన్నయ్య వస్తాడా...రాడా?

చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌. ముగ్గురు ముగ్గురే. అన్నయ్య, తమ్ముడు వెండితెరపై తిరుగులేని కథానాయకులు. నడిపి అన్నయ్య నాగబాబు, వారిలా స్టార్ హీరో కాకపోయినా, నటుడిగా, నిర్మాతగా, బుల్లితెర షోల జడ్జిగా తన ప్రయాణం సాగిస్తున్నారు. అయితే సిల్వర్ స్క్రీన్‌ నుంచి పొలిటికల్ స్క్రీన్‌ వైపు, ఈ మెగా బ్రదర్స్‌ ఫేస్‌ టర్నింగ్ ఇచ్చుకున్నారు.

2009లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించగా, 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ నెలకొల్పారు పవన్ కల్యాణ్. నాడు టీడీపీ, బీజేపీలకు మద్దతివ్వగా, నేడు సింగిల్‌గా యుద్ధభూమిలోకి దిగుతున్నారు. అయితే, మరో బ్రదర్ నాగబాబు తొలిసారి, ప్రత్యక్ష ఎన్నికల్లోకి ప్రవేశిస్తున్నారు. జనసేన నుంచి నరసాపురం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అటు పవన్ కల్యాణ్‌ కూడా, ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్నారు. అదీ కూడా రెండు స్థానాల నుంచి. అయితే, ఇక్కడ అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ ఇద్దరు తమ్ముళ్ల కోసం అన్నయ్య చిరంజీవి ప్రచారానికి వస్తారా....రారా అని?

ఇప్పుడు జనసేన కీలకమైన పరీక్షా టైంలో ఉంది. తమ్ముడు పవన్, రాత్రింబవళ్లు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎలాగైనా కింగ్ లేదంటే కింగ్ మేకర్ అవ్వాలని కష్టపడుతున్నారు పవన్. భీమవరం, గాజువాకల నుంచి, రెండు సెగ్మెంట్లలో పోటీకి దిగుతున్నారు. ఇలాంటి క్రూషియల్ టైంలో, చిరంజీవి గనుక అండగా నిలిస్తే, పవన్‌కు తిరుగుండదని మెగాభిమానులు భావిస్తున్నారు. జనసేన తరపున ప్రచారానికి రావాలని ఆకాంక్షిస్తున్నారు. కనీసం పవన్ పోటీ చేసే స్థానాలపై భీమవరం, గాజువాకలోనైనా క్యాంపెయిన్ చేస్తే, మిగతా స్థానాల్లో పవన్‌ దృష్టిపెట్టడానికి రిలీఫ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. కానీ, తమ్ముడు పవన్ కల్యాణ్‌, ఎన్నికల్లో సక్సెస్ కావాలని అభిలషిస్తున్న చిరంజీవి, క్యాంపెయిన్‌‌పై మాత్రం ఎలాంటి పాజిటివ్ సిగ్నల్స్ ఇవ్వడం లేదు.

అటు నాగబాబు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్నారు. సామాజికవర్గం పరంగా కీలకమైన నరసాపురం నుంచి బరిలోకి దిగుతున్నారు. కనీసం నాగబాబుకైనా, ప్రచారానికి రావాలని, అభిమానులు కోరుకుంటున్నారు. కానీ చిరంజీవి ఆలోచనలు మాత్రం, ఇప్పుడు సైరా షూటింగ్‌ మీదే ఉన్నాయి తప్ప, ఎన్నికలపై లేవన్నది, టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట.

ప్రజారాజ్యం స్థాపించి, దాన్ని నడపలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారు చిరంజీవి. రాజ్యసభ ఎంపీ అయ్యారు. కేంద్రమంత్రిగానూ చేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. కానీ 2014 తర్వాత కాంగ్రెస్‌కు అసలు టచ్‌లో లేరు. సినిమాల మీదే దృష్టిపెట్టారు. తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 తీశారు. ఆ తర్వాత సైరా మొదలుపెట్టారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ కనీసం కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన స్టేట్ మెంట్లు ఇవ్వడం లేదు చిరంజీవి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా కోరినా చిరంజీవి స్పందించలేదని తెలుస్తోంది. పైగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగిసినా, చిరంజీవి ఇంకా దాన్ని పునరుద్ధరించుకోలేదట. ఈ పరిణామాలను చూస్తుంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా?..దూరమైతే ఎందుకు దూరమైనట్టు?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌‌ను, వంద అడుగుల గొయ్యి తీసి పాతేశారు జనం. అక్కడిప్పుడు రఘువీరా రెడ్డి ఏక్‌ నిరంజన్‌లా పార్టీని నడిపిస్తున్నారు. కాంగ్రెస్‌ ఉద్దండ నాయకులంతా, వైసీపీ, టీడీపీ, బీజేపీలంటూ తలో దిక్కూ తరలిపోతున్నారు. సమీప భవిష్యత్తులో కూడా కాంగ్రెస్‌కు మంచిరోజులు కనపడ్డంలేదు. అందుకే కాంగ్రెస్‌ తరపున ఎంత పోరాడినా, అడవికాచిన వెన్నెలే అనుకుంటున్నారు చిరంజీవి. దాని పునరుజ్జీవానికి కృషి చేయాలని, పార్టీ కీలక పదవులు ఇస్తామని అధిష్టానం ఆఫర్ చేసినా చిరంజీవి అటువైపు చూడ్డంలేదు. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు స్కోపేలేదని లెక్కలేస్తున్న చిరంజీవి, అటువంటప్పుడు ప్రచారం చేయడం ఎందుకు, పరువు తీసుకోవడం ఎందుకని భావిస్తున్నారు. సో, కాంగ్రెస్‌ తరపున చిరంజీవి ప్రచారం చేసే అవకాశమే లేదనుకోవాలి.

చిరంజీవి తిరిగి జనసేనలోకి వెళతారని, ఆమధ్య ఊహాగానాలు వినిపించాయి. పవన్ కల్యాణ్‌ చిరు గురించి అదేపనిగా ప్రస్తావించడమే అందుకు కారణం. అయితే, జనసేనలోకి వెళ్లకపోవడానికి కూడా చాలా కారణాలున్నాయని అర్థమవుతోంది. ఎందుకంటే, ప్రజారాజ్యం వైఫల్యం జనం మర్చిపోలేదు. అదే పార్టీలో నాడు యువరాజ్యం అంటూ పవన్ హడావుడి చేశారు. కానీ ఆల్ ఆఫ్‌ సడెన్‌గా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో ఇప్పుడు చిరు గనుక జనసేనలోకి వెళితే, పవన్‌ కల్యాణ్‌కే ఇబ్బంది. జనం నుంచి ప్రశ్నలు ఎదురుగాక తప్పదు. ఇద్దరూ కలిసి ఒకే పార్టీలో ఉంటే జనసేన కాస్త మరో ప్రజారాజ్యం కాకతప్పదని, ప్రత్యర్థి పార్టీలు విమర్శించే ఛాన్సుంది.

అంతేకాదు, చిరంజీవి పార్టీలోకి వస్తే, పవన్ కంటే చిరుకే పెద్ద పోస్ట్ ఇవ్వాలి. ఇద్దరి మధ్యా హోదా తారతమ్యాలు తప్పవు. చిరుతో పాటు చాలామంది మళ్లీ జనసేనలోకి వచ్చేస్తారు. అది పవన్‌కు నచ్చదు. అంతేకాదు, అసలు పవన్‌ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, కింగ్‌ అవుతుందో, కింగ్ మేకర్‌ అవుతుందో, తెలీదు. అందుకే ఇప్పుడు జనసేనలోకి వెళ్లడం, మళ్లీ ప్రజారాజ్యాన్ని ఎందుకు గుర్తు చేయడం, తమ్ముడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకుంటున్న చిరు, గట్టున నిలబడి అంతా సైలెంట్‌గా చూద్దామనుకుంటున్నారు.

జనసేనలోకి వెళ్లకపోయినా పర్వాలేదు, కనీసం తమ్ముళ్లు పోటీ చేసే నియోజకవర్గాల్లోనైనా చిరంజీవి ప్రచారం చెయ్యాలని, మెగాభిమానులు ఆకాంక్షిస్తున్నా, అందుకు సుముఖంగా లేరు చిరు. ఎందుకంటే, పవన్‌ చిరును ఆహ్వానించలేదు. చిరు కూడా అడగలేరు. ఒకవేళ ప్రచారానికి వస్తే, మేలు కంటే ఇబ్బందే ఎక్కువని, చిరంజీవి, పవన్‌లు మధనపడుతున్నారని తెలుస్తోంది. మరి క్యాంపెయినింగ్‌ గడువు ముగిసేలోగా, కనీసం ట్విట్టర్ లేదంటే వీడియో మెసేజ్‌ పంపుతూ, తమ్ముళ్లకు మద్దతిస్తారా చిరు కాకపోయినా మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ అయినా, ప్రచారంలో పాల్గొంటారో, లేదో చూడాలి.


Next Story