Top
logo

'బాహుబలి'ని మించిన కుట్ర ఇది: చంద్రబాబు

Highlights

డేటా చోరీ కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుట్ర, కుతంత్రాలన్నీ ఆధారాలతో సహా...

డేటా చోరీ కుట్రకు ఢిల్లీలోనే స్కెచ్ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుట్ర, కుతంత్రాలన్నీ ఆధారాలతో సహా దొరికాయని చెప్పుకొచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత ఇలాంటి కుట్రలు చేయడం ఇప్పుడే మొదటిసారి చూశానని వ్యాఖ్యానించారు. బాహుబలి సినిమాలో కూడా ఇన్ని కుట్రలు జరగలేదన్న చంద్రబాబు అయినా దొంగతనం చేసినవాళ్లు దొరక్కుండా ఎక్కడికి పోతారని అన్నారు.

చరిత్రలో చాలా కుట్రలు చూశాం కానీ ఇలాంటి కుట్రను ఇప్పుడే మొదటిసారి చూశానన్నారు చంద్రబాబు. ఐటీ గ్రిడ్స్‌ కంపెనీపై దాడులు చేయడం చట్ట విరుద్ధమన్న ఏపీ సీఎం డేటా మొత్తం దొంగిలించుకుని పోయారని ఆరోపించారు. అంతేకాకుండా సేవా మిత్ర, ఇన్సూరెన్స్‌ సమాచారం ఎత్తుకెళ్లారని ధ్వజమెత్తారు. ఇది లూటీలు చేసే డెకాయిట్‌ ప్రభుత్వమా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కంప్లైంట్‌ ఇవ్వకుండా దొంగతనానికి పాల్పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ఎవరు కంప్లైంట్‌ ఇచ్చారో, ఎక్కడ ఇచ్చారో చెప్పలేదన్నారు. డేటా పోయిందని అర్థరాత్రి ఎవరైనా కంప్లైంట్‌ ఇస్తారా? ఏపీ ప్రభుత్వ డేటా పోతే మాకు ముందు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. పైగా మా డేటా దొంగిలించి మాపైనే కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.

కోర్టుకు కూడా తెలియకుండా కుట్రలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇదంతా విజయసాయిరెడ్డి డైరెక్షన్‌లో జరిగిందన్నారు. ఎస్సార్‌‌నగర్‌ పీఎస్‌లో దినేష్‌రెడ్డితో ఎందుకు కంప్లైంట్‌ ఇప్పించారని బాబు ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్‌పై కంప్లైంట్‌కు ముందు దాడులు చేసినట్లు తెలంగాణ సిట్‌ చీఫ్‌ స్టీఫెన్‌ రవీంద్ర కూడా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు చేయమని మీకేమైనా కల వచ్చిందా?, రాజకీయ పార్టీలకే మనుగడ లేకపోతే సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు.

ఐటీ గ్రిడ్స్ సంస్థ అధినేత అశోక్ ఇంటిపై అర్ధరాత్రి దాడి చేశారనీ, అలాగే నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకోవడంతోపాటు వారి కుటుంబ సభ్యులను బెదిరించారని బాబు ఫైరయ్యారు. తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యమా? లేక లూటీలు చేసే దోపిడీదారుల ప్రభుత్వమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో మళ్లీ పటేల్ వ్యవస్థను తీసుకొచ్చి రాజకీయ పార్టీలపై దాడిచేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైసీపీకి లబ్ది చేయడానికే సేవా మిత్ర యాప్, సభ్యత్వ నమోదు, ఇన్సూరెన్స్ సమాచారం, సభ్యత్వ నిధి తదితర సమాచారాన్ని దొంగిలించారని చంద్రబాబు అన్నారు. ఐటీ గ్రిడ్స్‌లో డేటా చోరీ వెనుక మహాకుట్ర ఉందన్నారు. ఎలాంటి కారణం చెప్పకుండానే డేటాను దొంగిలించుకుని పోయారని, ఇది పట్టపగలు దోపిడీ చేయడమేనన్నారు. ప్రజలు ఛీ కొడతారన్న భయం కూడా లేకుండా బరితెగించారని బాబు ఫైరయ్యారు.


లైవ్ టీవి


Share it
Top