ఏపీ రాజకీయాల్లో హాట్‌హాట్‌గా రీ పోలింగ్ వ్యవహారం

ఏపీ రాజకీయాల్లో హాట్‌హాట్‌గా రీ పోలింగ్ వ్యవహారం
x
Highlights

భానుడితో పోటీ పడి ఏపీ రాజకీయాలు మండిపోతున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతున్న నేపధ్యంలో చంద్రగిరిలోని ఐదు...

భానుడితో పోటీ పడి ఏపీ రాజకీయాలు మండిపోతున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీల మధ్య మాటల యుద్ధం చెలరేగుతున్న నేపధ్యంలో చంద్రగిరిలోని ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్ వ్యవహారం మరింత ముదిరింది. అధికారులను టార్గెట్ చేసుకుంటూ టీడీపీ విమర్శలు గుప్పిస్తుండగా చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది.

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం రీ పోలింగ్‌కు ఆదేశించడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. తాము బలంగా ఉన్న కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ కావాలనే రీ పోలింగ్‌‌కు తెచ్చేలా అధికారులపై ఒత్తిడి తెచ్చిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో పాటు ఎన్నికల అధికారి ద్వివేది సహకరిస్తున్నారంటూ నేతలు ఆరోపించారు.

ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం చంద్రబాబు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరిగిన 34 రోజుల తరువాత రీపోలింగ్‌కు ఆదేశిస్తారా ? అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలకూడదని భావించిన టీడీపీ న్యాయపోరాటానికి సిద్ధమైంది. నిబంధనలకు విరుద్ధంగా రీ పోలింగ్‌కు ఆదేశించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ నేతల ఆరోపణలు ఎలా ఉన్నా ఈసీ మాత్రం తన చర్యలను సమర్ధించుకుంది. పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతే రీ పోలింగ్‌ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలియజేశారు. పోలింగ్‌‌లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించుకున్న తరువాతే పీవో, ఏపీవోలను సస్పెండ్‌ చేయడంతో పాటు ఇతర అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినట్లు తెలిపారు.

తాజా పరిణామాలపై చంద్రబాబు టార్గెట్‌గా వైసీపీ అధినేత జగన్ ప్రశ్నలు సంధించారు. రీ పోలింగ్‌కు గగ్గోలు పెడుతున్న చంద్రబాబు రిగ్గింగ్‌ను సమర్ధిస్తున్నారా ? అంటూ ప్రశ్నించారు. చంద్రగిరిలో దళితులు ఓటు వేయకుండా అడ్డుకుంటారా ? అంటూ ఆగ్రహంగా ప్రశ్నించారు. ఓ వైపు రాజకీయ వివాదాలు రగులుతుండగానే రేపటి ఎన్నిక కోసం ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో దగ్గరుండి పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన భదత్రా ఏర్పాట్లు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories