Top
logo

జయప్రదంగా ముగిసిన రెండ‌వ‌ రోజు సార్వత్రిక సమ్మె

జయప్రదంగా ముగిసిన రెండ‌వ‌ రోజు సార్వత్రిక సమ్మె
Highlights

దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె రెండో రోజు జరిగింది. పలు రాష్ట్రాల్లో బంద్ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు...

దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె రెండో రోజు జరిగింది. పలు రాష్ట్రాల్లో బంద్ హింసాత్మకంగా మారింది. నిరసనకారులు బస్సులపై రాళ్లు రువ్వారు. ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె రెండో రోజు కొనసాగింది. కార్మిక రంగ సమస్యలపై 12 డిమాండ్లతో రెండో రోజు కార్మిక సంఘాలు దేశవ్యాప్త బంద్‌ పాటించాయి. కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సామాజిక భద్రత కల్పించాలని, ధరలు నియంత్రించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.

కేరళ, పశ్చిమ్‌బంగా రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా కనిపించింది. బంద్‌ నేపథ్యంలో కేరళలో 4,500 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ముంబయి ప్రజారవాణా విభాగానికి చెందిన ఉద్యోగులు సమ్మె చేయడంతో ప్రజారవాణాకు అంతరాయం ఏర్పడింది. కర్ణాటకలో బస్సులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. పశ్చిమ్‌బంగాలోని కొన్ని చోట్ల ఆందోళనకారులు విధ్వంసాలకు పాల్పడ్డారు. కోల్‌కతాలో కార్మికులకు మద్దతుగా సీపీఎం కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపట్టారు. హౌరాలో ఓ స్కూల్‌ బస్సుపై నిరసనకారులు దాడి చేశారు. ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. జాదవ్‌పూర్‌లో పోలీసులు, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మరోవైపు కార్మికుల ఆందోళనల దృష్ట్యా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించాలని పశ్చిమ్‌బంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు సమ్మె కొనసాగింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఐడిఎలో కార్మిక సంఘాలు విధులు బహిష్కరించాయి. వెయ్యి గ్యాస్ ట్యాంకర్లతో పాటు నాలుగు వేల వరకు లారీలు, ఇతర పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా రాజోలు తహసిల్దార్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. కనీస వేతన చట్టం అమలు చేయాలంటూ, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తెలంగాణ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ వర్కర్లు వంటవార్పు నిర్వహించి నిరసన తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ లోని తపాల ప్రధాన కార్యాలయం వద్ద తపాల ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పర్మనెంట్ క్లాస్ ఫోర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, స్టాఫ్ నర్స్, శానిటేషన్, సెక్యురిటి ఉద్యోగులు ధర్నా చేశారు.

Next Story

లైవ్ టీవి


Share it