logo

వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు అండగా దేశం

వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు అండగా  దేశం
Highlights

పుల్వామా ఉగ్రదాడి దేశ ప్రజలను కలిచి వేసింది. పూడ్చలేని నష్టాన్ని మిగిల్చింది. వీర జవాన్ల బలిదానం భారతీయులను...

పుల్వామా ఉగ్రదాడి దేశ ప్రజలను కలిచి వేసింది. పూడ్చలేని నష్టాన్ని మిగిల్చింది. వీర జవాన్ల బలిదానం భారతీయులను కన్నీరు పెట్టించింది. జవాన్ల కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు సెలెబ్రెటీలు ముందుకు వస్తున్నారు. తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు దేశం యావత్తూ అండగా నిలుస్తోంది. భారీగా విరాళాలు అందజేస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అమరులైన భద్రతా దళాల కుటుంబాలకు స్వచ్ఛందంగా తోడ్పాటు అందించడానికి భారత్ కే వీర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఎస్‌బీ, అస్సామ్ రైఫిల్స్‌ల్లో విధులు నిర్వర్తిస్తూ అమరులైన వారికి ఈ విరాళాలు అందజేస్తున్నట్టు తెలిపింది.

పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన ఒక్కో అమర జవాను కుటుంబానికి ఏపీ ప్రభుత్వం తరపున 5లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికి గుర్తుంచుకుంటుందంటూ నివాళి అర్పించారు. అమరుల కుటుంబాలకు సహకారం అందించేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకోవడానికి మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయ ట్రస్టు ముందుకు వచ్చింది. వారి కుటుంబాలకు 2.51 కోట్ల విరాళం ఇస్తామని ట్రస్టు ప్రకటించింది.

అమరులైన 40మంది వీర జవాన్ల కుటుంబాలకు 2.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు అమితాబ్ బచ్చన్. ఆ మొత్తాన్ని అందజేసేందుకు సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్నామని అమితాబ్ ప్రతినిధి తెలిపారు. ఫుల్వామా దాడిలో అమరులైన జవానుల కుటుంబాల పిల్లల్ని చదివిస్తానని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. తన వంతుగా అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లందరి పిల్లల్ని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తానని తెలిపారు. వారి విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని ట్వీట్ చేశారు. బాక్సర్ విజేందర్ సింగ్ కూడా తన నెల జీతాన్ని విరాళంగా అందజేశారు. కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన అమర జవాన్ గురు కుటుంబాన్ని ఆదుకొనేందుకు ప్రముఖ సినీ నటి సుమలత ముందుకు వచ్చారు. గురు కుటుంబానికి అర ఎకరం భూమిని ప్రకటించి ఔదార్యం చాటుకున్నారు తన సొంత జిల్లా మండ్యకు చెందిన గురు మరణం తనను బాధించిందని తెలిపారు సుమలత. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వం నుంచో, పార్టీ ఫండ్ నుంచో కాకుండా తన సంపాదనలో 25 లక్షల రూపాయలను కేటీఆర్ విరాళంగా ఇచ్చారు.


లైవ్ టీవి


Share it
Top