ఫిరాయింపులకు కాంగ్రెస్ చెక్...స్థానిక ఎన్నికల్లో తెరపైకి ప్రమాణ పత్రం

ఫిరాయింపులకు కాంగ్రెస్ చెక్...స్థానిక ఎన్నికల్లో తెరపైకి ప్రమాణ పత్రం
x
Highlights

గెలుస్తున్నారు పార్టీ మారుతున్నారు కాంగ్రెస్ పార్టీని కొన్నేళ్లుగా వేధిస్తున్న సమస్య ఇది. ఈసారి ఎలాగైనా దీనికి చెక్ పెట్టాలని టీపీసీసీ ముమ్మర యత్నాలు...

గెలుస్తున్నారు పార్టీ మారుతున్నారు కాంగ్రెస్ పార్టీని కొన్నేళ్లుగా వేధిస్తున్న సమస్య ఇది. ఈసారి ఎలాగైనా దీనికి చెక్ పెట్టాలని టీపీసీసీ ముమ్మర యత్నాలు చేస్తోంది. త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలు చేజారకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పార్టీ ఫిరాయింపులు దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీనే. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ పంచన చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది రిపీట్ కాకుండా ఉండాలని నేతలు చూస్తున్నారు. ఇందుకోసం ప్రమాణ పత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో హస్తం గుర్తుతో గెలిచి పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రాలు తీసుకోవాలని టీపీసీసీ భావిస్తోంది. స్థానిక ఎన్నికలపై గాంధీభవన్‌లో సమావేశమైన కుంతియా, ఉత్తమ్, డీసీసీ అధ్యక్షులు దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. బరిలో ఉండే జడ్పీటీసీ, ఎంపిటీసీ అభ్యర్థుల నుంచి ముందస్తుగా పార్టీకి ప్రమాణ పత్రం అందించేలా పార్టీ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సెలెక్ట్ ఎలెక్ట్ విధానాన్ని పాటించనున్నట్లు కాంగ్రెస్ ప్రటించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికను పూర్తిగా స్థానిక నేతలకు అప్పగించింది. పార్టీకి విధేయులుగా ఉన్న వారు, ప్రజాదరణ కలిగి గెలుపునకు అవకాశం ఉన్న వారిని అభ్యర్థులుగా బరిలో నిలుపాలని పీసీసీ ఆదేశించింది.

గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుని రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని హస్తం నేతలు సిద్ధం అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories