రాయబరేలీలో రసవత్తర సమరం...గతంలో సోనియా...

రాయబరేలీలో రసవత్తర సమరం...గతంలో సోనియా...
x
Highlights

ముల్లును ముల్లుతోనే తీయాలని బీజేపి భావిస్తోంది. గాంధీల కుటుంబానికి ఒకప్పుడు వీర విధేయుడుగా మెలిగి ఆపై బీజేపీలోకి జంప్ చేసి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న...

ముల్లును ముల్లుతోనే తీయాలని బీజేపి భావిస్తోంది. గాంధీల కుటుంబానికి ఒకప్పుడు వీర విధేయుడుగా మెలిగి ఆపై బీజేపీలోకి జంప్ చేసి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దినేష్ ప్రతాప్ సింగ్ ను సోనియా ప్రత్యర్ధిగా బిజేపీ నిర్ణయించింది. గాంధీ కుటుంబం పూర్వ పరాలు పూర్తిగా తెలిసిన దినేష్ అయితేనే అక్కడ పోటీని ఎదుర్కొనగలరని బీజేపీ అంచనా వేసింది. రాయబరేలి నియోజక వర్గం బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?

గాంధీల కంచుకోట రాయబరేలీలో మహాయుద్ధానికి తెర లేచింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజక వర్గంలో బీజేపీ దినేష్ ప్రతాప్ సింగ్ ను తమ అభ్యర్ధిగా ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దినేష్ ఇప్పుడు సోనియా ప్రత్యర్ధిగా రంగంలోకి దిగుతున్నారు. సోనియా కుటుంబానికి అత్యంత విధేయుడుగా పేరుపడిన దినేష్ రాహుల్ కు అత్యంత సన్నిహితుడుగా, ప్రియాంకకు సలహాదారుడుగా కూడా కొనసాగారు. అప్పట్లో నియోజక వర్గంలో దినేష్ ఆడింది ఆట, పాడింది పాటగా ఉండేది. కాంగ్రెస్ కార్యకర్తలతో అసభ్యంగా ప్రవర్తించడం, పంచాయతీ సభ్యులను కిడ్నాప్ చేయడం, జిల్లా పంచాయతీ అధ్యక్షుడైన తన అన్న అవధేష్ కోసం ఇతరులను తిట్టడం, కొట్టడం చేసేవారన్న ఆరోపణలున్నాయి. సోనియా నియోజక వర్గం ప్రతినిధి అయిన కిషోరీ లాల్ శర్మను ఆ పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. అప్పటి నుంచి పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉండే దినేష్ కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత బీజేపీలోకి జంప్ చేశారు.

వాస్తవానికి గత మూడు దశాబ్దాలుగా ఈ నియోజక వర్గం గాంధీ కుటుంబం కంచుకోటగా మిగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచాక సోనియాను అనారోగ్యం వేధించడంతో ఆమె నియోజక వర్గానికి పెద్దగా వచ్చింది లేదు. 2014లో బీజేపి అధికారం లోకి వచ్చిన నాటినుంచి అమేథీ, రాయబరేలి నియోజక వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ సీనియర్ నేతలు ఈ అయిదేళ్లలో పదే, పదే ఈ రెండు నియోజక వర్గాలను సందర్శించడం, అనేక పధకాలు ప్రకటించడం, పనులు వేగంగా పూర్తి చేయడం ద్వారా పట్టు సాధించారు రాయబరేలీకి హం సఫర్ రేక్ అనే మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ తేవాలన్నది సోనియా కల కానీ బీజేపీ శ్రేణులే ఫ్యాక్టరీ కేటాయించి మోడీ చేత శంకుస్థాపన చేయించారు. నియోజక వర్గంలో అనేక పథకాలకు సోనియా శ్రీకారం చుట్టినా ప్రజలను పరామర్శించడానికి వచ్చినది మాత్రం తక్కువే. ఈఏడాది జనవరిలో ఆమె చివరి సారిగా రాయబరేలీ వచ్చారు. సోనియాను అనారోగ్యం వేధిస్తుండటంతో ఈసారి ఆమె కుమార్తె ప్రియాంక బరిలోకి దిగుతారని అంతా భావించారు. కానీ ప్రియాంకను యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి సీఎం అభ్యర్ధిగా రంగంలోకి దింపాలని కాంగ్రెస్ సీనియర్లు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. దాంతో ఈ సారి సోనియాయే ఇక్కడ నుంచి బరిలో నిలుస్తారు ప్రస్తుతం దినేష్ ప్రతాప్ సింగ్ బీజేపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగడం తో రాయబరేలి ఫలితం ఉత్కంఠగా మారనుంది.

రాయబరేలిలోమొత్తం ఓటర్ల సంఖ్య15 లక్షల94 వేల 654 . ఇందులో మగ ఓటర్ల సంఖ్య53 శాతం కాగా, మహిళా ఓటర్లు 46 శాతం ఉన్నారు. 2014 ఎన్నికల్లో అయిదు పార్టీలు ఈ నియోజక వర్గంలో పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్ధి సోనియా గాంధీ 63 శాతం మెజారిటీతో గెలిచారు. ఎస్పీ, బీఎస్పీ కూటమితో పాటు, ఇండిపెండెంట్లను కలుపుకుంటే ఈ నియోజక వర్గంలో బహుముఖ పోరు తప్పేలా లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories