మరోసారి వారణాసి బరిలో ప్రధాని మోడీ

మరోసారి వారణాసి బరిలో ప్రధాని మోడీ
x
Highlights

దేశంలోని 20 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 184 పార్లమెంట్ స్ధానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. తొలి విడత పోలింగ్ జరిగే 46 స్ధానాలకు...

దేశంలోని 20 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 184 పార్లమెంట్ స్ధానాలకు బీజేపీ అభ్యర్ధులను ప్రకటించింది. తొలి విడత పోలింగ్ జరిగే 46 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. మిత్రపక్షాలకు కాకుండా మిగిలిన 30 స్ధానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని అధిష్టానం ప్రకటించింది. ఇందులో వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఎంపీలతో పాటు పలువురు ప్రముఖులున్నారు .

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. 184 మందితో తొలి జాబితాను పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ప్రధాని మోదీ మరోసారి వారణాసి నుంచే పోటీ చేయనుండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గాంధీనగర్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వాని ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో నుంచి , నితిన్‌ గడ్కరీ నాగ్‌పూర్, కిరణ్‌ రిజిజు అరుణాచల్‌ ఈస్ట్‌ నుంచి లోక్‌సభ బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి పోటీకి దిగనున్నారు. ఇక నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే సాక్షి మహారాజ్‌ మరోసారి ఉన్నావ్‌ నుంచే పోటీ చేయనున్నారు. డ్రీమ్ గర్ల్‌ హేమామాలిని, మాజీ త్రివిధ దళాధిపతి వీకే సింగ్ ఉత్తర ప్రదేశ్‌ నుంచే మరోసారి బరిలోకి దిగనున్నారు.

మరో కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అహిర్‌ మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి పూనం మహాజన్‌ ముంబై నార్త్ నుంచి ప్రీతమ్‌ గోపీనాథ్‌ ముండే - బీడ్ నుంచి బరిలోకి దిగనున్నారు. కర్నాటకలో యడ్యూరప్ప సన్నిహితురాలు శోభా కర్లందాజే‌కు చిక్‌మంగళూరు టికెట్ దక్కింది. ఇక రాష్ట్రాల వారిగా చూస్తే పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి అత్యధికంగా 28 స్ధానాల చొప్పున అభ్యర్ధులను ప్రకటించారు. కర్నాటకలో 21, రాజస్ధాన్‌, మహారాష్ట్రల్లో 16 చొప్పున, కేరళలో 13, ఒడిషా,తెలంగాణాల్లో 10 స్ధానాల చొప్పున అభ్యర్ధులను ప్రకటించారు. ఉత్తరాఖండ్‌, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, జమ్ముకశ్మీర్‌ల్లో 5 స్ధానాల చొప్పున, ఏపీ త్రిపుర, మణిపూర్‌, అరుణాచల్ ప్రదేశ్‌లలో రెండు స్ధానాల చొప్పున అభ్యర్ధులను ప్రకటించారు. ఇక అస్సాంలో ఎనిమిది స్ధానాలకు, సిక్కిం, మిజోరం, లక్షద్వీప్‌, అండమాన్ నికోబార్‌, దాద్రానగర్ హవేలి, గుజరాత్‌ల నుంచి ఒక్కో స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. ఇందులో తొలి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాలు 46 వరకు ఉన్నాయి. ఏపీ, తెలంగాణాల్లో ఇంకా 30 స్ధానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.

తాజా జాబితాలో సీనియర్ నేత అద్వానీని పక్కన బెట్టడం ఇదే స్ధానాన్ని అమిత్‌షాకు కేటాయించడం కొత్త ఊహాగానాలకు తెరతతీసింది. గుజరాత్ నుంచి ప్రకటించిన ఏకైక స్ధానం గాంధీ నగర్ ఒక్కటే కావడంపై ఢిల్లీ పొటికల్ సర్కిళ్లలో ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీ పోటీ చేయబోరనే వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories