గుప్తనిధుల వేటకు వెళ్లిన బ్యాంక్ ఉద్యోగి ఘోర మరణం

గుప్తనిధుల వేటకు వెళ్లిన బ్యాంక్ ఉద్యోగి ఘోర మరణం
x
Highlights

గుప్త నిధుల కోసం అడవిలోకి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రకాశం జిల్లా తాడివారిపల్లి అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు వ్యక్తులు...

గుప్త నిధుల కోసం అడవిలోకి వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రకాశం జిల్లా తాడివారిపల్లి అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. మొత్తం ముగ్గురు వ్యక్తులు బృందంగా ఏర్పడి నల్లమల్ల అడవుల్లోకి వెళ్లారు. వీరిలో ఒకరు మాత్రమే తిరిగి వచ్చారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, మరోకరు అదృశ్యమయ్యారు. అడవి నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఇచ్చిన సమాచారంలో అదృశ్యమైన వ్యక్తి కోసం అడవిలో గాలింపు చేపట్టారు.

నల్లమల అటవీ ప్రాంతంలో యాదవుల ఇలవేల్పు అయిన వేనూతల కాటంరాజు స్వామి పూర్వం తిరిగాడని, అక్కడ గుప్త నిధులు ఉన్నాయని కొందరి నమ్మకం. ఈ విషయాన్ని తెలుసుకున్న హైదరాబాద్‌కు చెందిన కట్టా శివకుమార్‌, గుంటూరు జిల్లాకు చెందిన కృష్ణనాయక్‌, హనుమంతరావు నాయక్‌ తాడివారిపల్లి నుంచి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, ఆ అడవిలో గుప్తనిధులు ఎక్కడ ఉన్నాయో తెలియకా, ఎటు నుంచి తవ్వాలో అర్ధం కాక ఈనెల 12వ తేదీ రాత్రి కొండపైనే ఉన్నారు. ఇక చేసేది లేక, 13వ తేదీ ఉదయం అడవి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. వీరి వెంట కొన్ని మజ్జిగ ప్యాకెట్లు, మూడు నీళ్ళ బాటిల్స్ మాత్ర మే తీసుకెళ్లారు. అవికాస్త అయిపోవడంతో దాహం తట్టుకోలేక శివకుమార్‌, హనుమంతరావు నాయక్‌ నడవలేక అడవిలోనే ఆగిపోయారు.

గుప్త నిధుల అన్వేషణ కోసం అడవిలోకి వెళ్లిన ముగ్గురిలో కృష్ణనాయక్‌ ఒక్కడే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తాడివారిపల్లి రోడ్డు వద్దకు వచ్చాడు. అయితే, శివకుమార్‌ పరిస్థితి గురించి, అతని కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో శివకుమార్‌ కుటుంబసభ్యులు, బంధువులు కంభం వెళ్లారు. కృష్ణనాయక్‌ను తీసుకొని, అటవీ ప్రాంతానికి వెళ్ళి శివకుమార్‌ కోసం గాలించారు. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో శివకుమార్‌ భార్య నిర్మల.. తాడివారిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొదిలి సీఐ ఆధ్వర్యంలో రిస్క్‌ టీమ్‌ తాడివారిపల్లి నుంచి శివకుమార్‌ను, హనుమంతనాయక్‌ను వెతికేందుకు నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్లారు. నిన్న ఉదయం శివకుమార్‌ మృతదేహాన్ని గుర్తించారు. కొండపై శివకుమార్‌ మృతదేహం బోర్లా పడి ఉండడాన్ని బట్టి కొండను ఎక్కలేని స్థితిలో అమాంతం పడి ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హనుమంతరావు నాయక్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శివకుమార్‌ హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలోని ఓ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. హనుమంతరావు నాయక్‌ హైదరాబాద్‌లో ఉంటూ ఇటువంటి గుప్త నిధుల ప్రదేశాలను చూపుతానంటూ పలువురిని నమ్మించి గైడ్‌గా వ్యవహరిస్తుంటాడని తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories