అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు....

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు....
x
Highlights

వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చర్చల ద్వారా కేసును పరిష్కరించడం కోసం ముగ్గురితో కూడిన మధ్యవర్తిత్వ...

వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చర్చల ద్వారా కేసును పరిష్కరించడం కోసం ముగ్గురితో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. చర్చల ప్రక్రియ కోసం మధ్యవర్తిత్వ ప్యానెల్‌కు 8 వారాల గడువు ఇచ్చింది.

బాబ్రీ మసీదు రామజన్మ భూ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పాటు చేసింది. ఇరు వర్గాల మధ్య చర్చలు జరపడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కలీఫుల్లా నేతృత్వం ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. మధ్యవర్తిత్వ ప్యానెల్‌‌లో జస్టిస్ కలీఫుల్లాతో పాటు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ న్యాయవాది శ్రీరాం పంచును సభ్యులుగా న్యాయస్థానం నియమించింది. ఫైజాబాద్ వేదికగా మధ్యవర్తిత్వం జరపాలని నిర్ణయించిన సుప్రీంకోర్టు చర్చలు ముగించడానికి 8 వారాల గడువు ఇచ్చింది.

అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ 4 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు చర్చలు గోప్యంగా జరగాలని చర్చల ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని మీడియా ప్రతినిధులకు ఎలాంటి సమాచారం అందించకూడదని ఆంక్షలు విధించింది.

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లా మధ్య సమనంగా పంచాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వగా ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ 14 పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే నిర్మోహీ అఖాడా మినహా హిందూత్వ సంస్థలన్నీ మధ్యవర్తిత్వానికి ససేమిరా అంటుంటే ముస్లిం సంస్థలు మాత్రం చర్చల పట్ల సానుకూలంగా ఉన్నాయి. 70 ఏళ్ళుగా నలుగుతున్న రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాద పరిష్కారానికి 8 వారాల్లోగా చర్చలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం ఆసక్తి రేపుతోంది.

అయోధ్య భూ వివాద పరిష్కారం కోసం చర్చల ప్రక్రియకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మే3వ తేదీతో ముగుస్తుంది. మరి మధ్యవర్తిత్వంపై పిటిషనర్లలో భిన్నాభిప్రాయాలు ఉన్న నేపధ్యంలో 8 వారాల్లోగా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories