కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తి...న్యాయపోరాటం చేసే...

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తి...న్యాయపోరాటం చేసే...
x
Highlights

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వివరణ కోరకుండానే వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి ముగ్గురు సీనియర్...

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వివరణ కోరకుండానే వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేయడాన్ని తప్పుబట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటం చేసే ఆలోచనలో ఉంది. ఈసీపై కేంద్ర ప్రభుత్వం, వైసీపీ ఒత్తిడి తెచ్చాయని ఆరోపిస్తోంది. ఇవాళ మధ్యాహ్నానికి ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లను ఈసీకి చీఫ్ సెక్రటరీ పంపనున్నారు. సాయంత్రానికల్లా వారి స్థానంలో కొత్త అధికారులను నియమించే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికల వేళ ఏపీ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం దుమారాన్ని రేపింది. ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులపై అకస్మాత్తుగా వేటుపడింది. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు కడప, శ్రీకాకుళం జిల్లా ఎస్పీలను రాత్రికి రాత్రే పోస్టుల నుంచి తప్పించింది ఈసీ. కడప ఎస్పీ రాహుల్‌ దేవ్ శర్మ, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటర్నంను తక్షణమే బాధ్యతల నుంచి తప్పిస్తూ ఈసీ రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ ఎలాంటి ఎన్నికల బాధ్యతలు నిర్వహించకూడదని ఆదేశిస్తూ హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్ చేసింది. ఇంటెలిజెన్స్‌లో తర్వాత సీనియర్ అధికారి ఆ బాధ్యతలు చేపట్టాలని ఈసీ సూచించింది.

ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఫోన్లను కూడా ట్యాప్ చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఇటీవల పదేపదే ఈసీకి ఫిర్యాదు చేశారు. వైసీపీ అధినేత జగన్‌ గత నెలలో, వైసీపీ ముఖ్య నాయకులు విజయ్‌సాయిరెడ్డి గత శుక్రవారం, సాయిరెడ్డితో పాటు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదులు అందజేశారు. వీటిపై స్పందించిన ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుంది.

అయితే వైసీపీ చేసిన ఫిర్యాదులపై అధికారుల నుంచి వివరణ కూడా తీసుకోకుండా ఈసీ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. నిబంధనలను అతిక్రమించి వెంకటేశ్వరరావును డీజీగా ప్రమోట్‌ చేశారని వైసీపీ నేతలు కమిషన్‌ ముందు ఆరోపించారు. డీజీపీతో కలిసి ఆయన పోలీసుల మేళా నిర్వహించి ప్రమోషన్లు ప్రకటించారని, అక్కడ అందరూ చంద్రబాబును కీర్తించేలా చేశారని ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. అలాగే, కేడర్‌ అధికారులు ఉన్నప్పటికీ నాన్‌ కేడర్‌ అధికారి అయిన వెంకటరత్నంను శ్రీకాకుళం ఎస్పీగా నియమించడం పట్ల కూడా వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఆయన ద్వారా టీడీపీ నేతలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. టీడీపీ నేతలు ఎన్నికల్లో డబ్బును తరలిస్తూ పట్టుబడితే వారిని ఆయన తప్పించారని ఆరోపించారు.

అలాగే, జగన్‌ బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్‌ చేస్తున్న దర్యాప్తు సరిగా లేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి, వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీంతో కడప ఎస్పీగా ఉన్న రాహుల్‌ దేవ్‌ శర్మను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌తో పాటు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, ఇంటెలిజెన్స్‌ అధికారి పోలీసు అధికారి యోగానంద్‌, చిత్తూరు, ప్రకాశం విజయనగరం ఎస్పీలు, తదితర అధికారులపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories