ఐపీఎస్‌ల బదిలీపై రాజకీయ రగడ..

ఐపీఎస్‌ల బదిలీపై రాజకీయ రగడ..
x
Highlights

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ లేకుండా ఎలా చర్యలు తీసుకుంటారంటూ ఈసీకి సీఎం...

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ లేకుండా ఎలా చర్యలు తీసుకుంటారంటూ ఈసీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి టీడీపీ నేతలు ఐపీఎస్‌ల బదిలీపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు డీజీపీ సహా ఇతర పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ రేపు వైసీపీ సీఈసీకి ఫిర్యాదు చేయబోతోంది.

ఏపీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ సహా, ఇద్దరు ఎస్పీల బదిలీ రగడ ముదురుతోంది. వైసీపీ ఫిర్యాదుపై ప్రాధమిక విచారణ కూడా చేయకుండా చర్యలు తీసుకోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారుల బదిలీలపై అభ్యంతరం చెబుతూ చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఒకవేళ ఈసీ నుంచి స్పందన లేకపోతే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. మరోవైపు ఇతర పోలీసు అధికారుల తీరుపై రేపు వైసీపీ సీఈసీకి ఫిర్యాదు చేయబోతోంది.

ఏపీ ఇంటెలిజెన్స్ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఎస్పీ అడ్డాల వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మలను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరస్థుడు విజయ సాయిరెడ్డి పిటిషన్‌ ఆధారంగా బదిలీ చేస్తారా అని చంద్రబాబు నిలదీశారు. అయినా ఎన్నికలకు సంబంధం లేని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారిని ఎలా బదిలీ చేస్తారని కర్నూలులో అన్నారు.

అంతేకాదు పోలీసు ఉన్నతాధికారుల బదిలీలను తప్పు పడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసీకి లేఖ రాశారు. వైసీపీ ఫిర్యాదుపై కనీసం ప్రాధమిక విచారణ చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని లేఖలో ప్రశ్నించారు. బదిలీ కారణాలు కూడా చెప్పకపోవడం దారుణమన్న చంద్రబాబు నిబంధనలను పట్టించుకోకుండా వేటు వేయడం సరికాదని అన్నారు. చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ నేతలు సీఎం రమేష్‌, కనకమేడల, జూపూడి ఈసీకి అందచేశారు. ఎన్నికల కమిషన్ పాత్ర అనుమానాస్పదంగా ఉండరాదని టీడీపీ నేతలు అన్నారు.

మరోవైపు నారాయణ విద్యా సంస్థ వాహనాల్లో టీడీపీ డబ్బులు తరలిస్తోంటే ఇంటిలిజెన్స్ డీజీ చొరవ వల్ల ఆ వాహనాలను పోలీసులు వదిలేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంటిలిజెన్స్ డీజీని మారిస్తే, ఆ అంశం సీఎం భద్రతా సమస్య ఎలా అవుతుందని నిలదీసింది. అలాగే ఎన్నికలు ముగిసే వరకు డీజీపీ ఠాకూర్‌ను విధుల నుంచి తప్పించాలని వైసీపీ నేత బొత్స డిమాండ్ చేశారు. చంద్రబాబు రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పందన లేకపోతే న్యాయపోరాటం చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఐపీఎస్ అధికారుల బదిలీపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories