ప్రజలకు హామీ ఇచ్చిన కొద్దిగంటల్లోనే సంచలన నిర్ణయాలు

ప్రజలకు హామీ ఇచ్చిన కొద్దిగంటల్లోనే సంచలన నిర్ణయాలు
x
Highlights

అవినీతి నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు....

అవినీతి నిర్మూలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. స్వచ్ఛమైన, అవినీతిలేని పాలన అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన క్షణాల్లోనే కాంట్రాక్టుల్లో అవినీతి నివారణకు చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ 1 నాటికి పనులు ప్రారంభం కాని కాంట్రాక్టులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సీఎంవోను ప్రక్షాళన చేశారు. నలుగురు ముఖ్య అధికారులను బదిలీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంట్రాక్టుల్లో అవినీతి నివారణకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన పనుల్లో నిధుల వ్యయం, బిల్లుల మంజూరుపై స్పష్టతనిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మెమో జారీ చేశారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితులను ఏమాత్రం పట్టించుకోకుండా మంజూరు చేసిన ఇంజినీరింగ్ పనులు రాష్ట్ర ఖజానాపై భారం పడేలా చేశాయని సీఎస్ ఆ మెమోలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఆర్థిక వనరులు దిగజారుతున్నాయని, చెల్లింపులకు ఆర్థిక వనరులు లేనందున రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నీ సదరు ఇంజినీరింగ్ పనులను నిలిపేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరై, ఇంకా ప్రారంభించని పనుల్ని రద్దుచేయాల్సిందేనని అన్ని శాఖలకు ఈ సందర్భంగా సూచనలు చేశారు. కనీసంలో కనీసం 25 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టుల విషయంలో వాటి విలువలను తాజాగా నిర్ధరించి, తదుపరి చెల్లింపులు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పేదల సంక్షేమంతో పాటు అవినీతి రహిత పాలన అందించడమే కొత్త ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నందున శాఖల కార్యదర్శులంతా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని తన మెమోలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎస్.

మరోవైపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే సీఎంవోను ప్రక్షాళన చేశారు. సీఎం కార్యాలయంలో కొనసాగుతున్న నలుగురు ముఖ్య అధికారులను బదిలీ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు జారీచేశారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న సతీశ్‌ చంద్ర, సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ముఖ్యమంత్రి కార్యదర్శులుగా వున్న గిరిజాశంకర్‌, అడుసుమిల్లి రాజమౌళిని బదిలీ చేశారు. వీరందరినీ సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని సీఎస్‌ ఆదేశాలు జారీచేశారు.

ఇక జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత సీఎంవోలో తొలి పోస్టింగ్ ఉత్తర్వును సైతం ఇచ్చారు. టూరిజం శాఖ ఎండీగా పనిచేస్తున్న ధనుంజయ్‌ రెడ్డిని సీఎం అదనపు కార్యదర్శిగా, ఓఎస్డీగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన కృష్ణమోహన్‌రెడ్డిని నియమించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories