చంద్రబాబు సంక్రాంతి కానుక...ఈ నెల నుంచి కొత్త పెన్షన్లు అమలు

Chandrababu
x
Chandrababu
Highlights

సంక్రాంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పెన్షన్లు 2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

సంక్రాంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పెన్షన్లు 2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం ఈ ప్రకటన చేశారు. ఈ నెల నుంచే పెంచిన పెన్షన్లు చెల్లిస్తారు. దీని ద్వారా 50లక్షల పైగా పెన్షన్ దారులకు లబ్ది చేకూరనుంది.

ఏపీలో పెన్షన్ దారులకు శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి కానుకగా పెన్షన్లను వెయ్యి నుంచి 2వేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరికి సంబంధించి పెన్షన్ ఇప్పటికే తీసుకున్న వారికి పెంచిన పెన్షన్లు ఫిబ్రవరిలో అందజేస్తామని సీఎం చెప్పారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. నెలనెలా ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు వస్తాయో అదే తరహాలో పెన్షన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం చెప్పుకొచ్చారు.

వృద్ధులు, వితంతువులు వయోభారంతో, మందులు కొనుక్కొనేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే పెన్షన్లు పెంచామన్నారు చంద్రబాబు. ఎంత ఖర్చయినా పర్వాలేదని, పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతానని తిరిగి ఆ సంపదను ప్రజలకే పంచుతానని చంద్రబాబు తెలిపారు.

అయితే, 2014కు ముందు పెన్షన్ నెలకు 200మాత్రమే. టీడీపీ అధికారంలోకి వచ్చాక నెలకు వెయ్యిరూపాలకు పెంపు చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పెన్షన్లు కలిపి దాదాపు 50,61,906 మందికి లబ్ధి చేకూరుతోంది. పింఛన్ల కోసం నెలకి 560కోట్లు చొప్పున ఏడాదికి 6,720కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అన్నిరకాల పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేయడంతో నెలకి 1,120కోట్లు ఏడాదికి 13,440కోట్లు చొప్పున వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తాజా జన్మభూమి గ్రామ సభల్లో ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి పెన్షన్ల కోసం మరో 1.05లక్షల దరఖాస్తులందాయి. వివిధ రూపాల్లో అందిన విజ్ఞప్తులతో కలిపి దాదాపు 4.55లక్షల కొత్త పెన్షన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. దీంతో మొత్తం 54లక్షలకు పైగా పెన్షన్ దారులకు ఫిబ్రవరి నుంచి లబ్ధి చేకూరనుంది. మొత్తానికి పెన్షన్ల పెంపుతో ఏపీలో పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories