నవ్యాంధ్ర చరిత్రలో నూతన అధ్యాయం

నవ్యాంధ్ర చరిత్రలో నూతన అధ్యాయం
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. మంగళవారం ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ చేత గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఏపీలో పూర్తిస్థాయిలో ఉన్నత న్యాయస్థానం కొలువుదీరినట్లైంది.

రాష్ట్ర విభజన తర్వాత నాలుగున్నరేళ్లకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొలువుదీరింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఆ తర్వాత మిగతా 13 మంది న్యాయమూర్తులతో కూడా గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. జస్టిస్ వెంకట నారాయణభట్టి, జస్టిస్ వెంకట శేషసాయి, జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గా ప్రసాదరావు, జస్టిస్ సునీల్‌చౌదరి, జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ శ్యాంప్రసాద్‌, జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ బాలయోగి, జస్టిస్ రజని, జస్టిస్ సుబ్రహ్మణ్య సోమయాజులు, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ గంగారావు ప్రమాణం చేశారు.

దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది. ఈ కార్యక్రమానికి సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు హాజరయ్యారు. ఆ తర్వాత సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలికంగా కొనసాగనున్న హైకోర్టును జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ హైకోర్టు రాకతో విభజన పూర్తయిందని భావిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమంగా హైకోర్టును తీర్చిదిద్దుతామని హైకోర్టు విధుల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

ఇదో చరిత్రాత్మక ఘటన అని కొత్త చరిత్ర మొదలైందని ఏపీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిల మార్గదర్శకత్వంలో పనిచేస్తామని వెల్లడించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రస్తుతం 9 కోర్టుహాళ్లను సిద్ధం చేయగా మరో హాలును మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న ఆర్‌‌అండ్‌‌బీ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories