అనంత టీడీపీ అభ్యర్థులు ఖరారు...భీమిలి నుంచి బరిలోకి నారా లోకేశ్..?

అనంత టీడీపీ అభ్యర్థులు ఖరారు...భీమిలి నుంచి బరిలోకి నారా లోకేశ్..?
x
Highlights

త్వరలో జరగబోయే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు అనంతపురం...

త్వరలో జరగబోయే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు అనంతపురం జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు. హిందూపురం నుంచి మరోసారి బాలయ్య బరిలోకి దిగుతున్నారు. ఇటు నారా లోకేశ్‌ కూడా ఈ సారి భీమిలి నుంచి పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మళ్లీ బాలకృష్ణ పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. అనంతపురం జిల్లా నేతలతో సమావేశం అయిన చంద్రబాబు హిందూపురం ఎంపీగా నిమ్మల కిష్టప్పకే మరోసారి అవకాశం కల్పించారు. పెనుగొండ నుంచి పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరి, మడకశిర నుంచి వీరన్న, రాప్తాడు నుంచి పరిటాల సునీత బరిలోకి దిగారు.

ఇక చివరి వరకు పెండింగ్‌లో పెట్టిన కదిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కందికుంట ప్రసాద్‌ పేరును ఖరారు చేశారు. టిక్కెట్‌ రేసులో ఉన్న చాంద్‌పాషాను కలుపుకొనివెళ్లాలని కందికుంటకు చంద్రబాబు సూచించారు. ఎన్నికల తర్వాత చాంద్‌పాషాకు సముచిత స్థానం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

దీంతో పాటు విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలపైన సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభా నియోజకవర్గ అభ్యర్థిగా ఈలి నాని పేరును ఖరారు చేశారు. చివరి వరకూ బాపిరాజు పేరును పరిశీలించిన చంద్రబాబు సామాజిక వర్గం సమీకరణలతో ఈలి నాని వైపు మొగ్గు చూపారు. అంతేకాకుండా తాడేపల్లిగూడెం స్థానాన్ని గెలిపించే బాధ్యతను కూడా బాపిరాజుకే అప్పగించారు.

ఇక మంత్రి నారా లోకేశ్‌ ఈ సారి భీమిలి నుంచి బరిలోకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావును ఎంపీగా బరిలోకి దింపే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో భీమిలి నుంచి లోకేశ్‌కు లైన్‌ క్లియర్‌ చేస్తున్నారని చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories