ఏపీ అసెంబ్లీలో పాగాకు పవన్ కల్యాణ్ తహతహ

ఏపీ అసెంబ్లీలో పాగాకు పవన్ కల్యాణ్ తహతహ
x
Highlights

ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నాడు. అన్ని రకాల సమీకరణాలను బేరీజు వేసుకొని మరీ విశాఖ జిల్లా...

ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నాడు. అన్ని రకాల సమీకరణాలను బేరీజు వేసుకొని మరీ విశాఖ జిల్లా లోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నియోజక వర్గాల నుంచి బరిలోకి దిగుతున్నాడు. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలుంటే గాజువాక, భీమవరం నియోజకవర్గాలను మాత్రమే పవన్ ఎంచుకోడం వెనుక కారణాలు ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వివిధ పార్టీలు, అభ్యర్థుల జయాపజయాలపైన ఊహాగానాలు జోరందుకొన్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలతో పాటు తొలిసారిగా బరిలోకి దిగిన జనసేన పార్టీ సైతం తన ఉనికిని కాపాడుకోడానికి తహతహలాడుతోంది. ప్రధానంగా జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోస్తాంధ్రలోని రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాయలసీమలోని నియోజకవర్గాలను కాదని కోస్తాంధ్రలోని గాజువాక, భీమవరం నియోజకవర్గాలను మాత్రమే జనసేనాని ఎంచుకొని నామినేషన్ల కార్యక్రమం ముగించడమే కాదు ప్రచార కార్యక్రమాలను సైతం హోరెత్తిస్తున్నాడు.

ప్రస్తుత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగిన ఏకైక అభ్యర్థిగా పవన్ కల్యాణ్ గుర్తింపు తెచ్చుకొన్నాడు. అంతేకాదు అటు విశాఖ, ఇటు పశ్చిమగోదావరి జిల్లాలలోని తమ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికే జనసేన అధిపతి పోటీ చేస్తున్నారంటూ ఓవైపు ప్రచారం జరుగుతుంటే మరోవైపు తన సామాజికవర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్న కారణంగానే పవన్ గాజువాకతో పాటు భీమవరం నియోజకవర్గాలను ఎంచుకొన్నట్లు చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర పారిశ్రామిక ముఖద్వారంగా పేరుపొందిన గాజువాక నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 55వేల మంది వరకూ ఉన్నారు. అంతేకాదు మరో 58వేలమంది జనసేన సభ్యత్వం తీసుకొన్న ఓటర్లు సైతం ఉన్నారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు 3 లక్షల 9 వేల 326 మంది కాగా ఇందులో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే 43వేలమంది వరకూ ఉన్నారు. అంతేకాదు విశాఖపట్నం జిల్లాలోనే ఎక్కువమంది ఓటర్లున్న అసెంబ్లీ నియోజకవర్గంగా గాజువాకకు పేరుంది. గ్లాసు గుర్తుతో జనసేన తరపున పవన్ పోటీకి దిగితే అధికార టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు, ప్రతిపక్ష వైసీపీ తరపున తిప్పల నాగిరెడ్డి సమరానికి సిద్ధమయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైతం పవన్ కల్యాణ్ తన అదృష్టం పరీక్షించుకొంటున్నారు. పవన్ కల్యాణ్ పూర్వీకుల నియోజకవర్గానికి చెంతనే ఉన్న భీమవరం నియోజకవర్గం ఓటర్లలో 70 వేలమంది కాపులే ఉన్నారు. దీనికితోడు పవన్ కల్యాణ్ మద్దతుదారులు సైతం భీమవరం నియోజకవర్గంలో వేలసంఖ్యలోనే ఉన్నారు. భీమవరం స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ ప్రధాన ప్రత్యర్థుల్లో టీడీపీకి చెందిన పులపర్తి రామాంజనేయులు, వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ సైతం ఉన్నారు.

భీమవరం నియోజకవర్గానికి చెంతనే ఉన్న నర్సాపురం పార్లమెంటరీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ సోదరుడు నాగబాబు సైతం పోటీపడుతున్నారు. మొత్తం మీద గత రికార్డులు, కులసమీకరణాల అంశాలను దృష్టిలో ఉంచుకొనే పవన్ కల్యాణ్ అటు గాజువాక, ఇటు భీమవరం నియోజకవర్గాలను ఎంపిక చేసుకొన్నారని...పైగా ఈ రెండు నియోజకవర్గాలలో పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఓటర్లే నిర్ణయాత్మకపాత్ర పోషించే స్థితిలో ఉన్నారని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గం ఓటర్లు పవన్ కు బ్రహ్మరథం పడతారన్నదే ఇక్కడి అసలు పాయింట్.

pawan kalyan janasena

Show Full Article
Print Article
Next Story
More Stories