Top
logo

చంద్రగిరిలో రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం

చంద్రగిరిలో రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం
Highlights

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో రేపు రీపోలింగ్‌కు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి...

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో రేపు రీపోలింగ్‌కు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్‌.ఆర్‌.కమ్మపల్లిలో జరిగిన ఘర్షణల దృష్ట్యా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టారు. అయితే, ఓ వైపు పోలింగ్‌కు గడువు సమీపిస్తున్నా అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రీపోలింగ్‌ జరిగే గ్రామాల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. రామచంద్రాపురం మండలం ఎన్.ఆర్‌.కమ్మపల్లిలోకి బయటి ప్రాంతాల నుంచి జనాలను తీసుకొస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇతర ప్రాంతాల వారిని తీసుకొచ్చి ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి పోలింగ్‌ కేంద్రం పరిధిలోని ఎస్సీ కాలనీలు, ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించేందుకు రెండు రోజులుగా ప్రయత్నించారు. తొలుత భారీగా అనుచరులతో వచ్చిన భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి మాదిగపల్లిలో డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి వాసులు అడ్డుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్‌ జరిగిన తమ గ్రామంలో రీపోలింగ్‌ పెట్టించిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గ్రామంలోకి వచ్చేందుకు వీల్లేదంటూ గ్రామ పొలిమేర వద్దే అడ్డుకున్నారు.

అయితే, ఎలాగైనా గ్రామంలోకి వెళ్లి ప్రచారం నిర్వహించాలని భాస్కర్‌రెడ్డి పట్టుబట్టారు. గురువారం రాత్రి 10గంటల వరకు ఇదే హైడ్రామా నెలకొంది. రాత్రి 10గంటల తర్వాత ప్రచారం చేసేందుకు వీల్లేకపోవడంతో వెనుదిరిగారు. మళ్లీ శుక్రవారం ఉదయం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి గ్రామంలోకి వచ్చి ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నించడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.


Next Story


లైవ్ టీవి