Top
logo

కలకలం రేపిన రాహుల్‌ వ్యాఖ్యలు

కలకలం రేపిన రాహుల్‌ వ్యాఖ్యలు
X
Highlights

రాహుల్‌గాంధీ నోరు జారారు. అంతర్జాతీయ ఉగ్రవాదిని గౌరవిస్తూ వ్యాఖ్యలు చేశారు. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టును...

రాహుల్‌గాంధీ నోరు జారారు. అంతర్జాతీయ ఉగ్రవాదిని గౌరవిస్తూ వ్యాఖ్యలు చేశారు. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టును 'జీ' అంటూ సంబోధించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో బీజేపీపై విమర్శలు చేసే క్రమంలో జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ జీ అంటూ పలికారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాహుల్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.

ఢిల్లీలో కాంగ్రెస్‌ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు అయిన జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను జీ అంటూ సంబోధించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. పుల్వామా ఘటనలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారని అతన్ని అప్పట్లో 56 అంగులాల ఛాతి ఉందని చెప్పుకునే ప్రభుత్వమే విడిచిపెట్టిందని రాహుల్‌ అన్నారు. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా కాందహార్ వెళ్లి మరీ మసూద్‌ అజర్‌ను అప్పగించారని చెబుతూ జీ అని సంబోధించారు.

రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. అంతర్జాతీయ టెర్రరిస్టును 'జీ' అంటూ సంబోధిస్తారా అని ప్రశ్నించింది. రాహుల్‌కూ, పాక్‌కూ ఉగ్రవాదులంటే చాలా ప్రేమ అని టెర్రరిస్టులను గౌరవించడమంటే పుల్వామా అమర వీరుల త్యాగాలను అవమానించడమే అంటూ రాహుల్‌పై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్‌ ద్వారా తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాకుండా రాహుల్‌ లవ్‌ టెర్రరిస్ట్‌ అనే హ్యష్‌ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేసింది. దేశ ఆర్మీని అనుమానిస్తున్న నాయకులు టెర్రరిస్టులను గౌరవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

బీజేపీ విమర్శలను కాంగ్రెస్‌ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. విమర్శలు చేసే బదులు దేశ ప్రజలకు ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది విమర్శించారు. ఎన్నికల ముంగిట రాహుల్‌ వ్యాఖ్యలు అధికార బీజేపీకి అస్త్రంగా మారడంతో కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు.

Next Story