logo

ఎన్నికల వేళ నమో టీమ్ కి అద్వానీ తలంటారా...బీజేపీ హిట్ లిస్టులో ఇంకెందరున్నారు?

ఎన్నికల వేళ నమో టీమ్ కి అద్వానీ తలంటారా...బీజేపీ హిట్ లిస్టులో ఇంకెందరున్నారు?
Highlights

ఎన్నికల రేస్ లో కురువృద్ధులకు స్థానం లేదని తేల్చేసిన మోడీపై అద్వానీ గుర్రుగా ఉన్నారా? అందుకే బ్లాగ్ ద్వారా...

ఎన్నికల రేస్ లో కురువృద్ధులకు స్థానం లేదని తేల్చేసిన మోడీపై అద్వానీ గుర్రుగా ఉన్నారా? అందుకే బ్లాగ్ ద్వారా కీలెరిగి వాత పెట్టారా? పార్టీ పట్ల ఎలా నడచుకోవాలో, పార్టీ సిద్ధాంతాలను ఎలా గౌరవించాలో అద్వానీ చెప్పడం మోడీని దెప్పిపొడవడమేనా? బీజేపీ హిట్ లిస్టులో ఇంకెందరున్నారు?

బీజేపీలో ఉక్కు మనిషి ఎట్టకేలకు మాట్లాడారు. పట్టరాని ఉద్వేగంలో తన మనసులో భావాలను బ్లాగ్ ద్వారా బయటపెట్టారు. గత కొంత కాలంగా పార్టీ అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నా భరించారు. పార్టీ వేదికలపైనా తనకు చోటు కల్పించక పోయినా సహించారు.ఎదురుపడి నమస్కరిస్తే కనీసం ప్రతి నమస్కారం చేయలేని అహంకారాన్ని ఓపిక పట్టారు కానీ ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోవాలని, చేసిన సేవలు చాలు ఇక దయ చేయండి అని ఓ సామాన్య కార్యకర్తతో చెప్పించడం ఆ ఉక్కు మనిషిని కుంగి పోయేలా చేసింది. అందుకే ఎట్టకేలకు నోరు విప్పారు ఏప్రిల్‌ ఆరో తేదీ బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ వ్యవస్థాపక నేత ఎల్‌.కె.ఆద్వానీ నోరు తెరిచారు.

బీజేపీ రథ యాత్ర పితామహుడు లాల్ కిషన్ అద్వానీ. రెండు సీట్ల నుంచి 200 సీట్లకు పార్టీ ఎదిగిన క్రమంలో తన కష్టాన్ని, శ్రమను, చెమట చుక్కనూ ధారబోసిన నేత, ధీర గంభీర వదనుడు ఒక్కసారిగా మౌనం వీడారు నోరు విప్పారు అదీ తన బ్లాగ్ ద్వారా పార్టీలో కొన్నాళ్లుగా నడుస్తున్న ఏకస్వామ్యాన్ని, ఒంటెత్తు పోకడలని గమనించి గమనించి చివరకు జోక్యం చేసుకున్నారు. పార్టీలో ఎవరికైనా ముందు దేశం, ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాతే నేను నాది అన్న స్వార్ధం ఉండాలని తేల్చి చెప్పారు. బీజేపీ ఎన్నో విలువలు, ఆశయాలతో ఒక్కో మెట్టూ ఎదిగిన పార్టీ విమర్శకులను సైతం ఏ నాడూ శత్రువుల్లా, దేశ ద్రోహుల్లా భావించలేదు విమర్శించలేదు. ప్రస్తుతం దేశాన్నేలుతున్న నేతలు, బీజేపీలోని వారందరూ ఈ వి‍షయాన్ని గమనించాలని సూచించారు. పార్టీ వెనుదిరిగి చూసుకోవాలని, గతం గుర్తు చేసుకోవాలని, భవిష్యత్తుపై ముందు చూపు ఉండాలని, అదే టైమ్ లో మనల్ని మనం విశ్లేషించుకోవాలనీ బ్లాగ్ లో రాశారు. పార్టీలో ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించి పాటించాలన్నారు.

అద్వానీ సూచనలకు మోడీ కూడా స్పందించారు పార్టీ సిద్ధాంతాలను అద్వానీ చక్కగా వివరించారన్నారు బీజేపీ కార్యకర్తగా పనిచేయడానికి గర్విస్తున్నానని మోడీ రిప్లయ్ ఇచ్చారు. పార్టీలో కురువృద్ధులను పోటీ నుంచి తప్పించాలంటూ బీజేపీ పెద్దలు తీసుకున్న నిర్ణయం మేరకు అద్వానీని సాగనంపారు. 70 ఏళ్లు దాటిన వారికి పార్టీ పదవులు వద్దని ఆరెస్సెస్ సూచించినా అద్వానీ, జోషీలకు మాత్రం మొన్నటి వరకూ మినహాయింపు ఉండేది. కానీ ఈ సారి ఎన్నికలు బీజేపీకి కొంత టెన్షన్ తెప్పిస్తున్నాయి. వివాదాస్పద నిర్ణయాలతో మోడీ గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది. ఈ టైమ్ లో పార్టీపై పూర్తి స్థాయి పట్టు కోరుకుంటున్న మోడీ, షా ద్వయం ఎన్నికల బరిలోకి ఏరికోరి అభ్యర్ధులను దించుతోంది. అద్వానీని ఆరుసార్లు గెలిపించిన గాంధీనగర్ సీటుపై అమిత్ షా కన్నేయడంతో అద్వానీకి ఉద్వాసన పలికారు అయితే ఓ సాధారణ కార్యకర్త ద్వారా అద్వానీకి ఈ విషయం చెప్పించడం ఆయన మనసును బాధించింది. బహుశా అందుకే తనదైన శైలిలో స్పందించారు. విపక్షాలను దేశ వ్యతిరేకులనే విధంగా మోడీ ఈ మధ్య చేస్తున్న విమర్శల గురించి పరోక్షంగా అద్వానీ ఈ సూచన చేశారు.

రాజకీయ కారణాలతో విభేదించే వారిని దేశద్రోహులుగా చూడరాదని, పార్టీలో ప్రతీ వ్యక్తికి రాజకీయంగా, వ్యక్తిగతంగా స్వేచ్ఛ ఉందని బీజేపీ సిద్ధాంతమే అది అనీ అద్వానీ బ్లాగ్ లో కామెంట్ చేశారు. బీజేపీ మార్గ దర్శక మండలి సభ్యుడైన ఆయన పార్టీకి దిశానిర్దేశం చేశారు. అద్వానీ సూచనలకు మోడీ పాజిటివ్ గా స్పందించినా అందులో వెటకారమే ఉందని బీజేపీలో కొందరు నేతలు భావిస్తున్నారు.

మరోవైపు అద్వానీతో పాటు మురళీ మనోహర్ జోషీకి కూడా సీటివ్వ లేదు. ఇక తనసీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా మండి పడ్డారు. బీజేపీ తీరు చూశాక తాను పోటీ చేయడం లేదని తేల్చేశారు. వీరే కాదు కల్ రాజ్ మిశ్రా, కైరా ముండా లాంటి నేతలకూ ఈసారి విశ్రాంతి ప్రకటించారు. ఎన్నికల వేళ అద్వానీ స్పందన మోడీకి పరోక్షంగా చురక వేయడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


లైవ్ టీవి


Share it
Top