మలుపు తిరుగుతున్న డేటా చోరీ కేసు

మలుపు తిరుగుతున్న డేటా చోరీ కేసు
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన డేటా చోరీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. సిట్ విచారణలో ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. తెలంగాణ, ఏపీ...

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన డేటా చోరీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. సిట్ విచారణలో ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 7కోట్ల 82లక్షల మంది డేటా చోరీకి గురైందని ప్రాథమికంగా నిర్దారించారు. అసలు నిందితుడు అశోక్‌ను విచారిస్తే సూత్రధారులెవరన్నది బయటపడుతుందని సిట్ అధికారులు చెబుతున్నారు.

ఐటీ గ్రిడ్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఐటీ గ్రిడ్ సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న సమాచారాన్ని మాదాపూర్ పోలీసులు కేంద్ర ఆధార్ సంస్థకు పంపించారు. ఐటీ గ్రిడ్స్ వద్ద ఉన్న సమాచారాన్ని, ఆధార్ సంస్థ వద్ద ఉన్న డేటా బేస్ ‌తో పోల్చి చూడాలని కోరారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సమాచారం ఆధార్ కార్యాలయం డేటా బేస్‌తో సరిపోయిందని నిర్దారించారు. దీనిపై ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ భవానీ ప్రసాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ గ్రిడ్ సంస్థపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సిట్ ‌కు అప్పగించారు.

ఐటి గ్రిడ్స్ సంస్థ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 7కోట్ల 82లక్షల మంది వ్యక్తిగత సమాచారాన్ని అక్రమ మార్గంలో సేకరించిందని ప్రైమరీ ఎస్.ఎఫ్.ఎల్‌. రిపోర్టులో తేలినట్లు తెలిసింది. ఆధార్ నెంబర్, ఆధార్ ఎన్‌రోట్మెంట్ నెంబర్ , కలర్ ఫొటోతో కూడిన జాబితా ఐటి గ్రిడ్స్ కు చేరిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధార్ సంస్థలోని సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోసిటరీ, స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ లింకులోకి ప్రవేశించి సమాచారాన్ని దొంగిలించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. రెండు సంస్థల నుంచి సేకరించిన సమాచారాన్ని పోలీసులు తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన 7కోట్ల 82 లక్షల మంది వ్యక్తిగత సమాచారం హార్డ్ డిస్క్‌లలో ఉన్నట్లు ఫోరెన్సిక్ లాబొరేటరీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

టీడీపీ నిర్వహిస్తున్న సేవా మిత్ర అప్లికేషన్‌కు అనుసంధానం చేసినట్లు పోలీసులు, ఫొరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన ఐటి గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికే మూడుసార్లు నోటీసులిచ్చినా అశోక్ పోలీసుల ఎదుట హాజరుకాలేదు. మరోవైపు తనపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలంటూ అశోక్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో అసలు సూత్రధారైన అశోక్‌ను విచారిస్తే దీని వెనుకున్న వ్యక్తులు ఎవరనేది బయటపడుతుందని సిట్ అధికారులంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories