ఒక యోధుడు... మూడు రోజులు

ఒక యోధుడు... మూడు రోజులు
x
Highlights

దేశంలో ఇప్పుడు అందరి చూపూ అభినందన్‌ వైపే. ప్రస్తుతం చర్చంతా వింగ్‌ కమాండర్‌ విక్రం అభినందన్‌ గురించే. అభినందన్‌ను పాక్‌ వదిలిపెడుతుందా లేదా అనే...

దేశంలో ఇప్పుడు అందరి చూపూ అభినందన్‌ వైపే. ప్రస్తుతం చర్చంతా వింగ్‌ కమాండర్‌ విక్రం అభినందన్‌ గురించే. అభినందన్‌ను పాక్‌ వదిలిపెడుతుందా లేదా అనే అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఆయన మాతృభూమిపై అడుగు పెట్టాడు. అసలు అభినందన్‌ బందీ చిక్కినప్పటి నుంచి విడుదల వరకు ఏం జరిగింది.

ఫిబ్రవరి 27

దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ యుద్ధ విమానాల్ని మిగ్ 21‌తో తరుముకుంటూ నియంత్రణ రేఖ దాటిన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ విక్రం అభినందన్ దాయాది దేశం ఆర్మీకి పట్టుబడ్డారు. అభినందన్‌ను స్థానికులు కొడుతుండగా 27వ తేదీ మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. పాక్ వాసుల చేతికి చిక్కిన అభినందన్ వీడియోలను, అతను గాయాలతో ఉన్న వీడియోలను ఆ దేశం విడుదల చేసింది. అది జరిగిన కొద్ది సేపటికే మిగ్ 21 కూలిందనీ దాని పైలెట్ కనిపించకుండా పోయినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు అధికారిక ప్రకటన చేశారు. తీవ్రగాయాలతో ఉన్న అభినందన్ వీడియోలు విడుదల చేసిన పాకిస్థాన్‌పై ప్రపంచ దేశాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. దాయాది దేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో అబినందన్‌ క్షేమంగా ఉన్నట్లు పాక్ ప్రకటించింది. పాక్ ఆర్మీ మేజర్‌ ఒకరు అబినందన్‌ను విచారిస్తున్న వీడియోను పాక్ విడుదల చేసింది. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ పాక్ చేతికి చిక్కారని నిర్థారించుకున్న భారత్ విక్రం అభినందన్‌ను అప్పగించకుంటే యుద్ధ పరిస్థితుల్లో ఉన్నట్లేనని హెచ్చరించింది.

ఫిబ్రవరి 28

భారత్ హెచ్చరికలతో పాటు అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి నేపధ్యంలో పాకిస్థాన్ అభినందన్‌ అప్పగింతపై పునరాలోచనలో పడింది. అలాగే పాకిస్థాన్ నుంచి ఇండియా త్వరలోనే మంచి కబురు వింటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అభినందన్ విడుదలపై ఆశలు చిగురించాయి. ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది సేపటికే పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అందరూ ఎదురు చూస్తున్న ప్రకటన చేశారు. అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నట్లు పాకిస్థాన్ పార్లమెంటులో ప్రకటించారు. ఇమ్రాన్ అలా ప్రకటించారో లేదో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. అభినందన్‌కు స్వాగతం పలకడానికి ఆయన కుటుంబ సభ్యులు గురువారం రాత్రి చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్నారు.

మార్చి 1

అభినందన్ విడుదల క్షణాలు దగ్గరికి రావడంతో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అభినందన్ మాతృభూమిపై అడుగుపెట్టే ప్రాంతమైన పంజాబ్‌లోని వాఘా సరిహద్దు దగ్గర ఉగ్విగ్న వాతావరణం నెలకొంది. అటు శుక్రవారం ఉదయం అభినందన్‌ను ఇస్లామాబాద్‌లోని ఇండియన్ రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించారు. ఇండో-పాక్ అధికారులు లాహోర్ మీదుగా అభినందన్‌ను తరలించే వేళ ఆయన విడుదలను సవాల్ చేస్తూ పాకిస్థాన్‌ కోర్టులో ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ దాఖలు చేయడం కాస్త ఉత్కంఠకు గురిచేసింది. అయితే ఆ పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ న్యాయస్థానం కొట్టేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మార్చి 1 సాయంత్రం 4.30కి అభినందన్‌ను పాక్ ఆర్మీ అధికారులు, పాక్‌లోని భారత ఎంబసీ అధికారులు వాఘా బోర్డర్ దగ్గరికి తీసుకొచ్చారు. 4.45కి ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టిన పాక్ అధికారులు 4.50కి అభినందన్‌కు మెడికల్ టెస్టులు చేశారు. అభినందన్‌ను స్వదేశానికి తోల్కొ ని రావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు 4.58కి వాఘా గేటు దగ్గరికి చేరుకున్నారు. 5.37కి వాఘా సరిహద్దు దగ్గర పాక్ భూభాగంలో ముగ్గరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అభినందన్‌ను కలిశారు. ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తైన తర్వాత సరిగ్గా 9.19 నిమిషాలకు వాఘ సరిహద్దు గేటు గుండా భారత్‌లోకి అడుగు పెట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆనందోత్సవాలు మిన్నంటాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు టపాసుల మోతలు, యువతరం కేకలు, ఈలలతో మార్మోగాయి. భరతమాత ముద్దుబిడ్డ అడుగు పెట్టిన శుభ సందర్భంగా స్వీట్లు పంచుకుంటూ ఆత్మీయంగా ఒకరిని ఒకరు కౌగిలించుకుంటూ పరస్పరం అభినందిచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories