నిజామాబాద్‌ బరిలో మొత్తం 240 మంది

నిజామాబాద్‌ బరిలో మొత్తం 240 మంది
x
Highlights

సార్వత్రిక సమరాంగణంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక రసవత్తరంగా మారింది.. పంటలకు మద్ధతు ధర సమస్యను జాతీయ స్థాయిలోకి తీసుకు వెళ్లేందుకు బ్యాలెట్ వార్ కు...

సార్వత్రిక సమరాంగణంలో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక రసవత్తరంగా మారింది.. పంటలకు మద్ధతు ధర సమస్యను జాతీయ స్థాయిలోకి తీసుకు వెళ్లేందుకు బ్యాలెట్ వార్ కు సిద్ధమయ్యారు పసుపు, ఎర్రజొన్న రైతులు. 240 మంది నామినేషన్లు వేశారు. ఉపసంహరణ తర్వాత కూడా అభ్యర్దులంతా బరిలో ఉంటే బ్యాలెట్ పోలింగ్ నిర్వహిస్తారా.. లేక ఎన్నిక వాయిదా వేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ రాష్ర్ట రాజకీయాల్లో వేడిపుట్టించారు పసుపు, ఎర్రొజన్న రైతులు పంటలకు మద్దతు ధర సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు బ్యాలెట్ పోరు ఎంచుకున్నారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి 240 మంది నామినేషన్లు వేశారు. 1996లో నల్లగొండ లోక్ సభ స్థానం నుంచి 642 మంది నామినేషన్లు వేసి ఫ్లోరోసిస్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లారు. అప్పట్లో అతిపెద్ద బ్యాలెట్ పేపర్ ముద్రించడానికి సమయం కావాల్సి ఉండటంతో ఎన్నికను వాయిదా వేసి మళ్లీ నిర్వహించారు. తాజాగా లోక్ సభకు జరుగుతున్న ఎన్నికల్లోనూ నిజామాబాద్ నుంచి రైతులు వేసిన నామినేషన్లపై చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా 24 బ్యాలెటింగ్‌ యూనిట్లను అనుసంధానించే అవకాశం ఉంది. 384 మంది అభ్యర్థుల పేర్లు వాటిపై డిస్‌ప్లే అవుతాయి. కానీ, ఒక్కో పోలింగ్‌ బూత్‌లో ఒకే టేబుల్‌పై 24 యూనిట్లను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. అభ్యర్థుల సంఖ్య 96 మించితే బూత్‌లలో కంపార్ట్‌మెంట్లు, ఈవీఎంల లింకింగ్‌ సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన 245 మంది బరిలో నిలిస్తే బ్యాలెట్‌ పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఓటరు సంతృప్తి కోసం వీవీ ప్యాట్‌ స్లిప్పులను మరిన్ని లెక్కించాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. వీవీ ప్యాట్ల సంఖ్య పెంచుతారా లేదా ఈ నెల 28 లోగా బదులివ్వాలంటూ ఆదేశించింది. సుప్రీం జోక్యంతో వీవీ ప్యాట్ అంశం కీలకంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంత మంది అభ్యర్ధులు పోటీలో ఉంటారన్నది స్పష్టత వచ్చిన తర్వాతే ఈవీఎంలతో లేదా బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించే అంశం వెల్లడిస్తామని రాష్ర్ట ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

ఈ స్థానం నుంచి సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తుండటంతో రైతులచే నామినేషన్ల ఉపసంహరింప చేసేందుకు అధికార పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. అధికార పార్టీ హామీతో రైతులు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా లేదా బరిలో ఉంటారా అన్నది ఈ నెల 28 నాటికి తేలనున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories