Top
logo

ముగ్గురూ ముగ్గురే.. వీరి నియోజకవర్గాలలో పోలింగ్ శాతం తీరుతెన్నులు

ముగ్గురూ ముగ్గురే.. వీరి నియోజకవర్గాలలో పోలింగ్ శాతం తీరుతెన్నులు
X
Highlights

నవ్యాంధ్రప్రదేశ్ లోని లోక్ సభ, శాసనసభ స్థానల జమిలి ఎన్నికల ఘట్టం ముగిసింది. వివిధ నియోజక వర్గాలతో పాటు ఓవరాల్...

నవ్యాంధ్రప్రదేశ్ లోని లోక్ సభ, శాసనసభ స్థానల జమిలి ఎన్నికల ఘట్టం ముగిసింది. వివిధ నియోజక వర్గాలతో పాటు ఓవరాల్ గా పోలింగ్ శాతం సైతం ఎంతో తేలిపోయింది. అయితే ఎన్నికల ఫలితాలు తేలటానికి మాత్రం మరో 40 రోజుల సమయం ఉండటంతో కీలక నియోజకవర్గాలపై ఊహాగానాలు జోరందుకొన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లను తలచుకోగానే చిత్తూరు జిల్లాలోని కుప్పం, కడప జిల్లాలోని పులివెందుల, విశాఖ జిల్లాలోని గాజువాక నియోజకవర్గాలే గుర్తుకు వస్తాయి. ఈ మూడు VIP నియోజకవర్గాలలో పోలింగ్ శాతం తీరుతెన్నులు ఓసారి చూద్దాం.

రాష్ట్రవిభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రెండో ఎన్నికలు పలు వివాదాల నడుమ ముగిశాయి. ప్రచారం తో పాటు పోలింగ్ ఘట్టం సైతం ముగిసిపోయింది. పోలింగ్ శాతం సైతం ఎంతో తేలిపోయింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అగ్రనేతలు బరిలోకి దిగిన నియోజకవర్గాలలో జయాపజయాలపై విశ్లేషణలు, ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయప్రస్థానంలో చావోబతుకో సమరానికి దిగారు. ముక్కోణపు యుద్ధంలో వైసీపీ, జనసేన పార్టీలతో పాటు బీజెపీ, కాంగ్రెస్ పార్టీలతో అమీతుమీకి సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి ఎప్పటిలానే చంద్రబాబు మరోసారి బరిలో నిలిచారు.

కుప్పం లో ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాబు మరో విజయానికి ఉరకలేస్తున్నారు. గత ఎన్నికలతో పోల్చి చూస్తే ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ శాతం సైతం గణనీయంగా పెరిగింది. 2014లో జరిగిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో 83. 80 శాతం పోలింగ్ నమోదు కాగా ప్రస్తుత 2019 ఎన్నికల్లో పోలింగ్ శాతం 85. 47 శాతానికి పెరిగింది. చంద్రబాబు ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీకి చెందిన చంద్రమౌళి వరుసగా రెండోసారి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సురేశ్ బాబు, జనసేన తరపున డాక్టర్ వెంకట రమణ, బీజెపీ అభ్యర్థిగా డాక్టర్ తులసీ నాథ్

పోటీలో ఉన్నా ఏమాత్రం ప్రభావం చూపగలరన్నది అనుమానమే. గత ఎన్నికలతో పోల్చిచూస్తే ఒకటిన్నర శాతానికి పైగా ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం పెరగటం ప్రభుత్వవ్యతిరేకతకు నిదర్శనమని వైసీపీ అంటుంటే టీడీపీ మాత్రం తమకు లభించిన సానుకూల ఓటు అంటూ చెబుతోంది.

మరోవైపు కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత జగన్ మరోసారి భారీ మెజారిటీతో గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు. 2014 ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో పోలింగ్ శాతం 79. 86గా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో పోలింగ్ శాతం ఒక్కశాతానికి పైగానే పెరిగింది. మొత్తం 80. 87 శాతంగా పోలింగ్ నమోదయ్యింది. పులివెందుల బరిలో జగన్ కు ముగ్గురు ప్రత్యర్థులు సవాలు విసురుతున్నా టీడీపీ అభ్యర్థి సతీశ్ రెడ్డి నుంచి మాత్రమే ప్రధానంగా పోటీ ఎదురుకానుంది. పులివెందుల పోలింగ్ లో నమోదైన ఒకశాతం అదనపు ఓట్లు తమకంటే తమకు పడతాయని ఇటు టీడీపీ, అటు వైసీపీ ధీమాగా చెబుతున్నాయి.

తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరంలో పాల్గొంటున్న జనసేన పార్టీ తన ప్రభావం చూపడంతో పాటు ఉనికిని చాటుకోడానికి తహతహలాడుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకంగా రెండు నియోజకవర్గాల నుంచి తన అదృష్టం పరీక్షించుకొంటున్నారు. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం స్థానాల నుంచి పవన్ పోటీలో నిలిచారు. విశాఖపట్నం జిల్లాలోనే అత్యంత ఎక్కువమంది ఓటర్లున్న నియోజకవర్గంగా పేరున్న గాజువాక నుంచి పవన్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థిగా టి. నాగిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా జనార్ధన్ పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో 64.69 పోలింగ్ శాతం ఉంటే ప్రస్తుత ఎన్నికల్లో అది స్వల్పంగా మాత్రమే పెరిగింది.

ఈవీఎంల మొరాయింపు, ఎండవేడిమి వంటి కారణాలతో పోలింగ్ శాతం కేవలం 65. 33 శాతానికే పరిమితమయ్యింది. ఈ నియోజకవర్గంలో పవన్ సామాజికవర్గ ఓటర్లు 55 వేలు, జనసేన పార్టీ కార్యకర్తలు మరో 55 వేలు ఉండటంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ జయాపజయాలపై కౌంటింగ్ ప్రారంభంకాక మునుపే ఎవరికివారే ఊహాగానాలతో తమకు తోచిన తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఓటరు దేవుళ్లు ఇచ్చే అంతిమ తీర్పు ఎంటో తెలుసుకోవాలంటే మాత్రం మరో 40రోజులపాటు ఓపికగా వేచిచూడక తప్పదు.

Next Story