Top
logo

మొత్తం 21 నిమిషాల్లోనే..

మొత్తం 21 నిమిషాల్లోనే..
X
Highlights

యుద్ధం జరిగాకే శాంతి నెలకొంటుంది. ఓ సినీ కవి అన్న మాటలు ఇవాళ అక్షర సత్యాలు. నిన్నటివరకు అణువణువూ...

యుద్ధం జరిగాకే శాంతి నెలకొంటుంది. ఓ సినీ కవి అన్న మాటలు ఇవాళ అక్షర సత్యాలు. నిన్నటివరకు అణువణువూ ప్రతికారేచ్ఛతో రగిలిపోయిన భారతీయులకు ఉగ్రవాద శిబిరాలే టార్గెట్‌గా జరిగిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఓ చిన్న ఉపశమనం ఇచ్చినట్లైంది. 40 మంది సైనికుల ప్రాణత్యాగానికి నిజమైన నివాళి అర్పించినట్లైంది. పక్కలో బల్లెంలా ఉన్న టెర్రరిస్టుల ఆట కట్టించిన మన వాయుసేనకు ప్రతీ ఇండియన్‌ సెల్యూట్‌ చేస్తున్నాడు.

ఫిబ్రవరి 14 దేశమంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్న వేళ జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా సెక్టార్‌ కొత్త రక్తచరిత్ర లిఖించింది. అడ్డదారిలో ఉగ్రమూకలు చేసిన పిరికిదాడిలో 44 మంది జవాన్లు నేలకూలారు. సరిహద్దు రక్షణకు బయల్దేరిన సైనికులు రక్తపుముద్దగా మిగిలారు. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనపై ప్రతీ భారతీయుడూ కన్నీరుపెట్టాడు. ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్న పట్టుదల పెంచుకున్నాడు. ఇటు కేంద్రం కూడా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తామని ప్రధాని కూడా పదే పదే చెప్పారు. పుల్వామా ఘటన తర్వాత వంద గంటల్లోనే సూత్రధారిని హతమార్చిన మన సైన్యం 12 రోజుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రశిబిరాలను నేలకూల్చింది.

నియంత్రణ రేఖనే కాకుండా అంతర్జాతీయ సరిహద్దును కూడా మన వాయుసేన దాటింది. 80 కిలోమీటర్ల దూరంలోని బాలాకోట్ లోని జైషే మొహమ్మద్ స్థావరంపై మన వాయుసేన ఒక్కసారిగా విరుచుకుపడింది. ఈ స్థావరం పర్వత ప్రాంతంలోని దట్టమైన అడవిలో ఉంది. పక్కా ప్లాన్ తో అక్కడకు వెళ్లిన మన మిరాజ్ జెట్ ఫైటర్లు కేవలం ఒకటిన్నర నిమిషంలో ఆపరేషన్ పూర్తి చేసి వెనుదిరిగాయి. ఈ దాడిలోనే దాదాపు 300 మంది ముష్కరులు ప్రాణాలు వదిలారు. ఈ టెర్రర్ క్యాంప్ జైషే మొహమ్మద్ కు అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న బాలాకోట్ ఉగ్ర శిబిరం ఈ దాడులతో పూర్తిగా ధ్వంసమైందని తెలుస్తోంది.

ఇక ఈ ప్రతీకారదాడుల్లో కీలక వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో కశ్మీర్, ఆఫ్ఘనిస్థాన్ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన జైషే మహ్మద్ ఉగ్రవాది మౌలానా అమర్, మౌలానా మసూద్ సోదరుడు మౌలానా తలహ సైఫ్, కశ్మీర్ దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ముఫ్తీ అజహర్‌ ఖాన్, మసూద్ అజహర్ అన్న ఇబ్రహీం అజహర్ ఉన్నారు. బాలకోట్ ఉగ్ర శిబిరాల వద్ద యూఎస్, యూకే, ఇజ్రాయిల్ దేశాల జెండాల పెయింటింగ్‌ను సైనికులు గుర్తించారు.

ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారంతో తొలుత లక్ష్యాన్ని గుర్తించినట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే చెప్పారు. భారత్ పై మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే మొహమ్మద్ కుట్ర పన్నిందని ఈ క్యాంపులో ఆత్మాహుతిదళ సభ్యలకు ట్రైనింగ్ ఇస్తున్నారని తమకు తెలిసిందని అందుకే సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సిద్ధమయ్యాయని వివరించారు. వాయుసేన దాడులలో జైషే మొహమ్మద్ సీనియర్ కమాండర్లు, టెర్రరిస్టులు, ట్రైనీలు ఇతర జిహాదీలు భారీ ఎత్తున చనిపోయారని గోఖలే వివరించారు. ఈ దాడుల్లో లేజర్ గైడెడ్ బాంబులను వినియోగించినట్లు తెలిపారు.

21 నిముషాల్లోనే మూడు లక్ష్యాలను ఛేదించిన వాయుసేన అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఇటు వాయుసేన చేపట్టిన ఆపరేషన్‌ జరుగుతున్న ప్రధాని మోడీ కంట్రోల్‌ రూమ్‌లోనే ఉన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ను వాయుసేన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆపరేషన్‌ పూర్తైందని తెలుసుకున్నాకే ప్రధాని మోడీ అక్కడి నుంచి వెనుదిరిగారు.

Next Story