ఆందోళనలో ఏపీ ఓటర్లు.. ప్రత్యామ్నాయాలపై చూపు

ఆందోళనలో ఏపీ ఓటర్లు.. ప్రత్యామ్నాయాలపై చూపు
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో సొంతూర్లకు వెళ్లి ఓటు వేయాలనుకుంటున్న ఆంధ్ర ఓటర్ల కల నెరవేరుతుందా..? ఓటు హక్కు వినియోగించుకుంటారా..? అంటే అనుమానమేనని ఏపీ ఓటర్లు...

సార్వత్రిక ఎన్నికల్లో సొంతూర్లకు వెళ్లి ఓటు వేయాలనుకుంటున్న ఆంధ్ర ఓటర్ల కల నెరవేరుతుందా..? ఓటు హక్కు వినియోగించుకుంటారా..? అంటే అనుమానమేనని ఏపీ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని బస్సుల్లో 90 శాతం రిజర్వేషన్లు కావడంతో చాలా మంది ప్రయాణానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. మరో వైపు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమ అనుచర గణంతో ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల పండగకు ఏపీకి వెళ్లే బస్సులు సజావుగా చేరుతాయా ఎంత మంది ఓటు హక్కు వినియోగించకుంటారు వీరి ప్రభావం ఏ రాజకీయపార్టీ పై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వరుస సెలవులు సొంతూర్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు. తెలంగాణ నుంచి దాదాపు పది లక్షల మంది ఏపీకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. వీరిలో దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ట్రైన్లలో వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే అన్ని బస్సుల్లోనూ 90 శాతం రిజర్వేషన్లు పూర్తయ్యినట్లు తెలుస్తోంది. ఎన్నికల తేదీకి ఒక్క రోజు ముందు ఏప్రిల్ పదో తేదీ మధ్యాహ్నానికే ఏపీకి బయలుదేరి వెళ్లనున్నారు.

ఓటు వేసేందుకు వెళ్ళేందుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అడ్డుకునే అవకాశం ఉందని ఆంధ్రా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్ లేదని ఫిట్ నెస్ లేదని నిబంధనలు పాటించడం లేదని సాకుతో బస్సులను మధ్యలోనే నిలిపివేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. వీలైనంత ముందుగానే సొంతర్లూకు చేరుకునేందుకు ఓటర్లు ప్లాన్ మార్చుకుంటున్నారు. ఒక వేళ ప్రైవేట్ బస్సులను మధ్యలోనే అడ్డుకుంటే సకాలంలో వెళ్లి ఓటు వేసేలా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుంటున్నారు.

మరో వైపు రద్దీకారణంగా ప్రయాణికులు ఎక్కడ తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటారోనని రాజకీయ పార్టీలు తెలంగాణలో స్థిరపడిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏపీ అభ్యర్ధులు తమ అనుచరగణంతో జనాలను తరలించేందుకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేపడుతున్నారు. సెటిలర్లను సొంతూళ్లకు రప్పించేందుకు వారి ఫోన్లకు సందేశాలు పంపుతూ అప్రమత్తం చేస్తున్నారు.

ఓటర్లను ఉచితంగా తీసుకు వెళ్లడమే కాకుండా.. వారి వారి ప్రాంతాల్లో ఓటు వేసిన తర్వాత తిరిగి తీసుకువచ్చే బాధ్యతకూడా తమదే అని అభ్యర్ధుల అనుచరులు చెబుతున్నారు. దారిలో టిఫిన్లు, భోజనం ఇతర ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పిస్తామంటూ చెబుతూ ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు వేల వరకు చేతి ఖర్చులకు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుండటంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఓటర్ల ప్రయాణం ఏ రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చి పెడుతుందో పోలింగ్ తర్వాత తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories