logo

పల్లెల్లో కళ తప్పిన సంక్రాంతి

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా గంగిరెద్దులు, హరిదాసులు, చెంచు కళాకారులు ధర్శనమిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ సందడి మచ్చుకైనా కనిపించటం లేదు.

పల్లెల్లో కళ తప్పిన సంక్రాంతి

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా గంగిరెద్దులు, హరిదాసులు, చెంచు కళాకారులు ధర్శనమిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ సందడి మచ్చుకైనా కనిపించటం లేదు. కులవృత్తులకు ఆదరణ తగ్గడంతో సంక్రాంతి కళాకారుల బతుకు ప్రయాణం దుర్భరంగా మారింది. గందిరెద్దులు విన్యాసాలు, హరిదాసుల కార్తనలు, చెంచులు తప్పెట గుళ్ళ నృత్యాలు కనిపించాయంటే సంక్రాంతి సందడి మొదలైనట్లే. గతంలో పల్లెల్లో ఈ సంబరం పండుగకు వారం పది రోజుల ముందే కనిపించేది. గందిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పాటలతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకునేవి. కానీ ఇపుడా పరిస్ధితి కనిపించటం లేదు. ప్రభుత్వం యేటా నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో మినహా హరిదాసులు, గందిరెద్దుల వారు ఎక్కడా కనిపించడం లేదు.

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు గంగిరెద్దులు, హరిదాసులు దొరకని దుస్థితి నెలకొంది. ప్రక్క జిల్లాల నుంచి పిలిపించాల్సిన పరిస్ధితి ఏర్పడింది. సంచార జీవనం గడిపే గంగిరెద్దుల వారికి ప్రజాదరణ తగ్గిపోయింది. దీంతో కుటుంబ పోషణ కష్టమై బిక్షాటన చేసే వారికంటే అద్వాన్నంగా తయారయ్యింది. అటు ప్రభుత్వం కూడా తమను నిర్లక్ష్యం చేస్తోందని గంగిరెద్దుల వారు వాపోతున్నారు.సంక్రాంతి సమయంలో తెల్లవారుతూనే గ్రామాల్లో ప్రత్యక్షమయ్యే హరిదాసుల పరిస్థితి కూడా ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సంక్రాంతి సీజన్‌లో హరిదాసులు కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇబ్బందులను పడుతున్నారు. కుటుంబాన్ని పోషించడం కష్టమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆదుకోవాలని హరిదాసులు కోరుతున్నారు.

హరిదాసుల గానం, గందిరెద్దుల విన్యాసాల తర్వాత సంక్రాంతికి ఎక్కువగా కనిపించేది జానపద నృత్యకారులే. తప్పెట గుళ్లు , చెంచు కళాకారులు తమ వృత్తులను పండగలకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పెట గుళ్లు ఆడేవారికి చెంచులకు ప్రభుత్వం నుంచి కళాకారుల పెన్షన్ అందుతున్నా కుటుంబ పోషణలో ఇబ్బందులు తప్పటం లేదు. ప్రభుత్వం 60 యేళ్లు దాటిన కళాకారులకు మాత్రమే పెన్షన్ ఇస్తోందనీ కళనే నమ్ముకున్న తమకు వయసుతో సంబంధం లేకుండా పింఛన్ ఇవ్వాలని కోరుతున్నారు. సంక్రాంతి పండగ సమయంలో ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపే వృత్తి కళాకారుల జీవితాల్లో ఇప్పటికైనా మార్పు రావాలని ఆశిద్దా. సంప్రదాయ వృత్తి కళాకారుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపాలని కోరుకుందాం.

లైవ్ టీవి

Share it
Top