Top
logo

జాబిల్లిని భారత్ మరింత దగ్గర చేస్తుందా?

జాబిల్లిని భారత్ మరింత దగ్గర చేస్తుందా?
X
Highlights

మన ఇస్రో చేపట్టిన చంద్రయాన్ - 2 ఇపుడు ప్రపంచ దేశాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా...

మన ఇస్రో చేపట్టిన చంద్రయాన్ - 2 ఇపుడు ప్రపంచ దేశాలను విపరీతంగా ఆకర్షిస్తోంది. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చామన్నట్టు చందమామ విశేషాలను మరింత విడమర్చి చేప్పేవిధంగా మన చంద్రయాన్ ఉందనేది చాలా మంది అభిప్రాయం. ఇస్రో లక్ష్యం కూడా అదే. ఇప్పటికే చంద్రయాన్ - 1 విజయవంతం కావడం.. ఆ పరిశోధనలోనే చంద్రునిపై నీరు ఉందనే విషయం నిర్ధారణ కావడంతో ఇప్పుడు ఈ చంద్రయాన్ - 2 పై ప్రపంచం దృష్టి పడటానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కొద్ది గంటల్లో.. అంటే రేపు తెల్లవారుజామున 2.51గంటలకు జీఎస్‌ఎల్వీ మార్క్‌ 3 ఎం1 వాహక నౌక ద్వారా చంద్రయాన్‌-2ని రోదసీలోకి పంపనున్నారు. అందుకోసం భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌సెంటర్‌ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక సిద్ధమైంది.

ఈ యాత్రపై ప్రపంచ మీడియా చాలా ఆసక్తి కనబరుస్తోంది. జాబిల్లిని భారత్ మనకు మరింత దగ్గర చేస్తుందా అంటూ మీడియాలో వార్తలు ప్రసారం చేస్తున్నాయి. చంద్రయాన్ కోసం భారత్ పెడుతున్న ఖర్చు చాలా తక్కువ ఉండడం కూడా మీడియా ఆసక్తికి కారణం. అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు విపరీతంగా ఖర్చు పెడతారు. అయితే చంద్రయాన్ కు అవుతున్న ఖర్చు దానితో పోలిస్తే చాలా తక్కువంటున్నారు. కేవలం 124 మిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ ప్రయోగం నిర్వహిస్తోంది ఇస్రో. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రష్యాలోని ప్రముఖ మీడియా సంస్థ స్పుత్నిక్‌ ఇది ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన హాలీవుడ్‌ చిత్రం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్‌' బడ్జెట్‌లో సగం కంటే తక్కువ. అవెంజర్స్‌ చిత్ర నిర్మాణ ఖర్చు దాదాపు 356 మలియన్ డాలర్లు అని అంచనా అంటూ వ్యాఖ్యానించింది. మానవుడు చంద్రుడిపై దిగి 50 ఏళ్ళు కావస్తున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు అందరూ జబిల్లిపై మోజు పడుతున్నారెందుకో అంటూ గార్డియన్ పత్రిక ఆశ్చర్యాన్ని ప్రకటించింది. ఇక అమెరికా ప్రముఖ వార్తా సంస్థ న్యూయార్క్‌ టైమ్స్‌ 'అందరూ తిరిగి చంద్రుడిపైకి ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు' అనే శీర్షికతో ''ఈ ప్రయోగం ద్వారా భారత్‌ తన అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాన్ని ప్రదర్శించనుంది. అంగారకుణ్ని చేరుకోబోతున్న అమెరికాకు మాత్రం చంద్రుడు ఒక విడిది మాత్రమే'' అని రాసుకొచ్చింది. ఇక సైంటిఫిక్‌ అమెరికన్‌ అనే వెబ్‌సైట్‌ చంద్రునిపై నీటి ఆనవాళ్లను కనిపెట్టడంలో చంద్రయాన్‌ ప్రయోగం ఎంతో ఉపకరిస్తుందని తెలిపింది. ఈ ప్రయోగంతో భవిష్యత్తు అంతరిక్షయానానికి కావాల్సిన నీరు, గాలి, రాకెట్‌ ఇంధనానికి పరిష్కారం లభించే అవకాశం ఉందంటూ విలువైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది.

ఇలా ప్రపంచమంతా మన చంద్రయాన్ - 2 పై ఆసక్తిని చూపిస్తుండడం మనకు గర్వకారణమే. రష్యా పత్రిక పేర్కొన్నట్టు ఇంత తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాన్ని ఇస్రో పూర్తి చేస్తుండడం మనందరికీ గర్వకారణం. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచానికి మన దేశం దిక్సూచిలా నిలబ్డుతున్దనడం లో సందేహం లేదు.

Next Story