Top
logo

2017 సీజన్లో కొహ్లీ రికార్డుల మోత

Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ 2017 సీజన్లో తన గోల్డెన్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. నాగపూర్ టెస్టులో డబుల్...

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ 2017 సీజన్లో తన గోల్డెన్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. నాగపూర్ టెస్టులో డబుల్ సెంచరీ సాధించడమే కాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సైతం నిలిచాడు. కెప్టెన్ గా అత్యధిక శతకాలు బాదిన భారత క్రికెటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఢిల్లీ డైనమైట్ విరాట్ కొహ్లీ డబుల్ ధమాకా పై HMTV స్పెషల్ స్టోరీ.

విరాట్ కొహ్లీ ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం మార్మోగిపోతున్న పేరు. టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, టీ-20 క్రికెట్ ఫార్మాట్ ఏదైనా సరే పరుగుల హోరు, సెంచరీల జోరులో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తర్వాతే ఎవరైనా. 2017 సీజన్లో కొహ్లీ ఓ స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గా మాత్రమే కాదు టీమిండియా కెప్టెన్ గానూ తన గోల్డెన్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. వన్డే ఫార్మాట్లో ప్రస్తుత సీజన్లో ఆరు శతకాలు బాదిన కొహ్లీ సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో నాలుగు సెంచరీలు సాధించాడు.

శ్రీలంకతో తీన్మార్ సిరీస్ లో భాగంగా కోల్ కతా టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సూపర్ సెంచరీ సాధించిన కొహ్లీ నాగపూర్ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో ఏకంగా డబుల్ సెంచరీ తో రికార్డుల మోత మోగించాడు. శ్రీలంక బౌలింగ్ ఎటాక్ ను ఓ ఆటాడుకొన్నాడు. మొత్తం 267 బాల్స్ ఎదుర్కొని 17 బౌండ్రీలు, 2 సిక్సర్లతో తన కెరియర్ లో ఐదో ద్విశతకం సాధించాడు. అంతేకాదు కెప్టెన్ గా కూడా కొహ్లీ ఇది ఐదో డబుల్ సెంచరీ కావడం విశేషం. భారత్ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ సచిన్ టెండుల్కర్ ల తర్వాతి స్థానంలో కొహ్లీ నిలిచాడు. అంతేకాదు టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా మొత్తం 12 సెంచరీలు సాధించడం ద్వారా ఇప్పటి వరకూ సునీల్ గవాస్కర్ పేరుతో ఉన్న 11 శతకాల రికార్డును తెరమరుగు చేశాడు.

టెస్టు క్రికెట్లో 115 ఇన్నింగ్స్ లో మాస్టర్ సచిన్ 19 శతకాలు సాధిస్తే కొహ్లీ మాత్రం కేవలం 114 ఇన్నింగ్స్ లోనే 19 సెంచరీలతో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. క్యాలెండర్ ఇయర్ లో వన్డే,టెస్టు ఫార్మాట్లలో 10 సెంచరీలు సాధించిన కెప్టెన్ కమ్ క్రికెటర్ రికార్డులను సైతం కొహ్లీ సాధించాడు. నాగపూర్ టెస్టులో టీమిండియాకు ఇన్నింగ్స్ 239 పరుగుల భారీవిజయం అందించడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. మొత్తం మీద 2017 సీజన్ ను కొహ్లీ కేవలం టీమిండియా షోగా మాత్రమే కాదు విరాట్ వండర్ షోగాను కొనసాగిస్తున్నాడు. ఇదే జోరు 2018 సీజన్లో అదీ పవర్ ఫుల్ సౌతాఫ్రికా పైనా
కొనసాగించాలని కోరుకొందాం.

Next Story