logo
సినిమా

‘విజేత’ మూవీ రివ్యూ

‘విజేత’ మూవీ రివ్యూ
X
Highlights

చిత్రం: విజేత నటీనటులు: కల్యాణ్‌దేవ్‌, మాళవిక నాయర్‌, మురళీశర్మ, నాజర్‌, సత్యం రాజేశ్‌, రాజీవ్‌ కనకాల...

చిత్రం: విజేత
నటీనటులు: కల్యాణ్‌దేవ్‌, మాళవిక నాయర్‌, మురళీశర్మ, నాజర్‌, సత్యం రాజేశ్‌, రాజీవ్‌ కనకాల తదితరులు
సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌
సినిమాటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌
నిర్మాత: సాయి కొర్రపాటి
దర్శకత్వం: రాకేశ్‌ శశి
బ్యానర్‌: వారాహి చలన చిత్రం
విడుదల తేదీ: 12-07-2018

మెగా ఫ్యామిలీ నుండి ఎందరో హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాకేశ్ శశి దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ నటించిన 'విజేత' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ కు ఎలాంటి విజయం దక్కిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

క‌థ‌: శ్రీనివాసరావు(మురళీశర్మ) ఓ మంచి తండ్రి. తన ఆశయాలను, కోరికలను, ఇష్టాలను చంపుకొని కుటుంబం కోసం బతుకుతుంటాడు. రామ్‌(కల్యాణ్‌దేవ్‌) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంటాడు. అతనేమో అత్తెసరు మార్కులతో పాసైన బ్యాచ్‌. ఉద్యోగం రాదు. శ్రీనివాసరావు స్నేహితుల పిల్లలు మంచి పొజిషన్‌లో ఉంటారు. కానీ, తన కొడుకు ఎప్పుడు ఎదుగుతాడా? అన్న బెంగతో ఉంటాడు శ్రీనివాసరావు. రామ్‌ మాత్రం బాధ్యతలేవీ పట్టకుండా తిరుగుతుంటాడు. తన కాలనీలో ఉన్న జైత్ర(మాళవిక నాయర్‌)ను ఇష్టపడతాడు. అసలు సీరియస్‌నెస్‌ లేని రామ్‌కు జీవితం విలువ.. నాన్న విలువ.. బాధ్యతల విలువ ఎలా తెలిశాయి? తనలో మార్పు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అనేదే కథ!

నటీనటులు ; విజేతతో వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్‌ పరవాలేదనిపించాడు. తొలి సినిమాతో పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా ఎమోషనల్‌ డ్రామాను ఎంచుకున్న కల్యాణ్ నటన పరంగా తన వంతు ప్రయత్నం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక నాయర్‌ ఆకట్టుకుంది. పెద్దగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ లేకపోయినా.. ఉన్నంతలో హుందాగా కనిపించి ఆకట్టుకుంది. ఇక సినిమా మేజర్‌ ప్లస్ పాయింట్‌ మురళీ శర్మ. బంధాలు బాధ్యతల మధ్య నలిగిపోయే తండ్రిగా మురళీ శర్మ అద్భుతంగా నటించాడు. కొడుకు కోసం ఏదైన చేసేయాలనుకునే మధ్య తరగతి తండ్రి పాత్రలో మురళీ శర్మ నటన చాలా సందర్భాల్లో కంటతడి పెట్టిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సీన్‌లో ఆయనే హీరోగా సినిమాను ముందుకు నడిపించాడు. హీరో ఫ్రెండ్స్‌గా సుదర్శన్‌, నోయల్‌, కిరిటీ, మహేష్‌లు ఫస్ట్‌ హాఫ్‌లో బాగానే నవ్వించారు. ఇతర పాత్రల్లో తనికెళ్ల భరణి, జయ ప్రకాష్‌, రాజీవ్‌ కనకాల తదితరులు తమ పరిధి మేరకు మెప్పించారు.

విశ్లేష‌ణ‌: న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. క‌ల్యాణ్‌దేవ్ పెర్ ఫార్మెన్స్ చూస్తే.. తొలి సినిమా కాబ‌ట్టి త‌న నుండి అద్భుతాలు ఆశించ‌లేం. అయితే పాత్ర ప‌రంగా ఇంకాస్త బెట‌ర్‌గా చేసుండ‌వ‌చ్చు. ఇక సినిమాకు ముర‌ళీశ‌ర్మ న‌ట‌నే హైలైట్‌గా నిలిచింది. సినిమాలో ఎమోష‌న‌ల్ కంటెంట్ అంత‌టినీ ముర‌ళీశ‌ర్మ క్యారీ చేశాడు. త‌న‌దైన న‌ట‌న‌తో, అనుభ‌వంతో పాత్ర‌కు ప‌రిపూర్ణ‌త తెచ్చాడు. ఇక జ‌య‌ప్ర‌కాశ్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, మాళ‌వికా నాయర్‌, ప్ర‌గ‌తి ఇత‌రుల న‌ట‌న వారి వారి ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. మాళ‌వికా నాయ‌ర్ పేరుకు హీరోయిన్ కానీ... ఆ పాత్ర‌లో న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. ఇక సాంకేతికంగా చూస్తే.. దర్శ‌కుడు రాకేశ్ శ‌శి ఫ‌స్టాఫ్ అంతా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చుట్టూనే సినిమాను న‌డిపించాడు. హీరో జులాయిగా తిర‌గ‌డం.. తండ్రి బాధ్య‌త‌ల‌ను తెలుసుకోక‌పోవ‌డం వంటి త‌ర‌హా క్యారెక్ట‌ర్ అన్న‌మాట‌. హీరో, అత‌ని ఫ్రెండ్స్ మ‌ధ్య వచ్చే కామెడీ కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా లేదు. ఇక సెకండాఫ్ అంతా హీరో బాధ్య‌త‌గా మెల‌గ‌డం.. తండ్రి కల‌ను తీర్చ‌డానికి కొడుకుగా త‌న వంతు బాధ్య‌త‌ను నేర‌వేర్చ‌డం వాటి సంద‌ర్భానుసారం వ‌చ్చే స‌న్నివేశాలు బావున్నాయి. సంభాష‌ణ‌లు అక్క‌డ‌క్క‌డా బావున్నాయి. సెంథిల్ కెమెరా ప‌నిత‌నం గురించి మ‌నం కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హ‌ర్ష‌వర్ధ‌న్ రామేశ్వ‌ర్ అందించిన ట్యూన్స్ ఓకే. నేప‌థ్య సంగీతం బాగానే ఉంది. మొత్తంగా చూస్తే ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మిది.

Next Story