Top
logo

కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరించిన ఉత్తమ్‌

కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరించిన ఉత్తమ్‌
X
Highlights

ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు టీపీసీసీ...

ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలు డిసెంబర్‌ లేదా మే నెలలో ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనన్నారు.‌ ముందస్తు ఎన్నికలు తెలంగాణ ప్రజలకు శుభవార్త అని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్నారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, విపక్షాల సంగతేమిటని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీని వీడిన మాజీ మంత్రి దానం నాగేందర్‌ కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్బంగా కేసీఆర్‌ .. విపక్షాలు సరేనంటే ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని తనకు అనుమానంగా ఉందని, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తమ పార్టీ నేతలు చెబుతున్నారని తెలిపారు. ఎన్నికలెప్పుడు జరిగినా వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తాజా సర్వే ద్వారా మరోసారి రుజువైందన్నారు. ఈ స్థానాల్లో 50% పైగా ఓట్లు తమవేనని, ఒక్కో ఎమ్మెల్యేకు 60 వేల నుంచి 70 వేల మెజారిటీ వస్తుందని అన్నారు. విపక్షాలకు తమకు 40% తేడా ఉందని, అవన్నీ కలిసినా ఓటమి తథ్యమని అన్నారు. 82 స్థానాల్లో 60 శాతానికి పైగా ఓట్లు తమవేనని, విపక్షాలు డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని సర్వేలో వెల్లడయిందని కేసీఆర్‌ తెలిపారు.

Next Story