ఈ కోటు గుండీ ధర రూ.కోటి ఇరవై లక్షలట!

ఈ కోటు గుండీ ధర రూ.కోటి ఇరవై లక్షలట!
x
Highlights

ఇప్పటిదాకా ఎన్నో రకాల మోసాలు చూసి ఉంటారు. కానీ హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఓ ఘటన అన్నింటినీ మించిపోయింది. చొక్కాకు వాడే గుండీలనే డైమండ్స్‌గా నమ్మించి...

ఇప్పటిదాకా ఎన్నో రకాల మోసాలు చూసి ఉంటారు. కానీ హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఓ ఘటన అన్నింటినీ మించిపోయింది. చొక్కాకు వాడే గుండీలనే డైమండ్స్‌గా నమ్మించి కొందరు కేటుగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. వాళ్ల పాపం పండి చివరకు పోలీసులకు చిక్కారు.

హైదరాబాద్‌లోని అసిఫ్ నగర్‌కు చెందిన మహ్మద్ అక్తర్ సిద్ధిఖీ, మెదక్ జిల్లాలోని బీహెచ్ఈఎల్ ఆర్సీ పురానికి చెందిన మహ్మద్ సలాంఖాన్ స్నేహితులు. రంగు రాళ్లు, ముత్యాలు వంటి ఆభరణాలకు వినియోగించే వస్తువులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లిన తమ్ముడికి డబ్బులు పంపిస్తూ అప్పులపాలయ్యాడు సలాంఖాన్. వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చాయి.

అప్పులు ఊబిలో చిక్కుకున్న సలాంఖాన్ తన స్నేహితుడు అక్తర్ సిద్ధిఖీతో కలిసి ఓ ప్లాన్ రచించాడు. ఈ నెల 14న చార్మినార్ సండే మార్కెట్‌కు వెళ్లి రూ. 3500 చెల్లించి నకిలీ డైమండ్‌ను కొన్నాడు. సనత్‌నగర్‌కు చెందిన తన పాత స్నేహితుడు, జ్వువెలరీ వ్యాపారి షేక్ హాజీతో తమ వ్యాపారంలో పెట్టుబడి పెట్టమని కోరాడు. ‘‘మా దగ్గర 25 కోట్ల రూపాయల విలువ చేసే వజ్రం ఉంది. ఇప్పుడు నాకు కొంత డబ్బు అత్యవసరంగా కావాలి. డైమండ్‌ను అమ్మే వరకు నీ దగ్గరే ఉంచుకో. అమ్మకం తర్వాత మనం వాటాలు తీసుకుందాం. ఇప్పుడు నాకు రూ. 2 కోట్లు ఇవ్వు.’’ అని షేక్ హజీతో సలాంఖాన్ నమ్మబలికాడు. సలాంఖాన్, అతడి స్నేహితుడు అక్తర్ సిద్ధిఖీలకు కోటి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి వజ్రాన్ని తీసుకున్నాడు షేక్ హాజీ.

సలాంఖాన్ కు డబ్బులిచ్చిన వారం తర్వాత షేక్ హజీ ఫోన్ చేసి బయ్యర్లను చూపించమని అడిగాడు. ప్రస్తుతం కొనుగోలుదారులు లేరు తర్వాత చూద్దాం అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఇక చేసేది లేక మార్కెట్లో తన దగ్గరున్న డైమండ్‌ను అమ్మేద్దామని వెళ్లాడు షేక్ హజీ. ఓ షాపులో డైమండ్‌ను తనిఖీ చేసిన వ్యాపారులు చెప్పిన మాట విని షేక్ హజీ షాక్ అయ్యాడు. అది విలువైన వజ్రం కాదని, చొక్కాలకు, కోటులకు వాడే ఖరీదైన గుండీ అని వ్యాపారులు చెప్పారు. దీంతో తాను మోసపోయానని షేక్ హజీ గ్రహించాడు.

ఇద్దరు మోసగాళ్లపై షేక్ హాజీ అబిడ్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేటుగాళ్లు సలాంఖాన్, అక్తర్ సిద్ధిఖీ పోలీసుల సాయంతో టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. వీరి నుంచి కోటి పదిహేను లక్షలు ఇరవై వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వజ్రం, వజ్రాన్ని పరీక్షించే పరికరం, వజ్రాన్ని సరితూచే ఎలక్ట్రికల్ మెషిన్, ఆల్ట్రావయోలెట్ రేస్ మెషిన్ తదితర సామాగ్రితో పాటు రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు.
నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు. సొంత దోస్తు చేసిన మోసాన్ని షేక్ హాజీ జీర్ణించుకోలేకపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories