అమ్మో ఆ సీటొద్దు...స్పీకర్‌ పదవి వద్దంటూ టీఆర్ఎస్‌లో...

x
Highlights

కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టారు. మంత్రులెవరనే దానిపై కసరత్తు కూడా ముమ్మరం చేశారు. మరి అందరి మెదళ్లను...

కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు చేపట్టారు. మంత్రులెవరనే దానిపై కసరత్తు కూడా ముమ్మరం చేశారు. మరి అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.. స్పీకర్‌ ఎవరు..? ఆ స్థానంలో కూర్చునేదెవరు..? ఆ పీఠాన్ని అధిరోహించేదెవరు..? ఇలా ఎన్ని ప్రశ్నలేసుకున్నా.. సభాపతి పేరు చెబితేనే.. గులాబీ నాయకుల్లో గుబులు మొదలవుతోంది.

ఉమ్మడి రాష్ట్రమైనా ప్రత్యేక రాష్ట్రమైనా ఆ ఆనవాయితీ మాత్రం తప్పలేదు. సభాపతిగా సేవలు అందిస్తే మళ్లీ ఆ సభలోకి అడుగుపెట్టలేమన్న సెంటిమెంట్‌ కు బ్రేక్‌ పడలేదు. మొన్నటి ఎన్నికల్లో అప్పటి శాసనసభాపతి మధుసూదనాచారి కూడా ఓడిపోయారు. దీంతో ఆ పీఠంలో కూర్చున్నవారెవరూ మరోసారి గెల్చినవారి ధాఖలాలు లేవు. దీంతో స్పీకర్‌ పోస్ట్‌ అంటేనే చాలు అధికార పార్టీ నాయకుల్లో వణుకు పుడుతోంది. ఏకంగా 20 యేళ్ల నుంచి ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. 1991 లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన శ్రీపాదరావు అప్పటి ఎన్నికల్లో ఓటమి చెందడంతో మొదలైస ఆనవాయితీ రాష్ట్రం వేరైనా అది కొనసాగుతోంది. తొలి మహిళా స్పీకర్‌ అయిన ప్రతిభాభారతి కూడా 1999 నుంచి స్పీకర్‌గా పనిచేసిన ఆమె 2004 ఎన్నికల్లో ఓటమి పాలై రాజకీయాల నుంచే తెరమరుగయ్యారు. 2009 లో సరేశ్‌రెడ్డి, 2014 లో నాదేండ్ల మనోహర్‌ ఇలా అందరూ స్పీకర్‌గా చేసి ఓటమిపాలైన వారే. ఆ సంప్రదాయం ప్రత్యేక తెలంగాణలో కూడా కొనసాగింది.

వాస్తవానికి స్పీకర్‌ గా పనిచేయడం అంటే అరుదైన గౌరవంగా భావిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు సభా అధ్యక్షుడు కూడా స్పీకర్‌ను గౌరవించాల్సిందే. అంతటి గౌరవ ప్రదమైన స్థానంలో కూర్చోవాలంటేనే భయపడిపోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే స్పీకర్‌ ను ఎన్నుకుంటామన్న ప్రభుత్వ నిర్ణయంతో ఎక్కడ తమకు ఆ పీఠం అంటుకుంటుందో అని భయపడిపోతున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమకా పదవి వద్దంటూ లాబీయింగ్ చేయడం మొదలుపెట్టారు.

స్పీకర్‌గా తమ పేర్లు తెరపైకి వచ్చాయంటే చాలు హైదరాబాద్‌లో వాలిపోతున్నారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌కు స్పీకర్‌ పోస్ట్‌ ఇస్తారనే ప్రచారం జరగడంతో తనకు మంత్రిపదవి ఇవ్వకున్నా సరే సభాపతిగా తాను పనిచేయనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అలాగే నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయితే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి మొరపెట్టుకున్నారట. వరంగల్‌ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓ సీనియర్ పేరు కూడా వినిపించింది. దీంతో ఆయనగారు స్పీకర్‌గా ఒప్పుకునేది లేదని తన అనుచరులతో చెప్పుకున్నారట. అలాగే మెదక్‌ జిల్లాకు చెంది మహిళా ఎమ్మెల్యేకు కూడా స్పీకర్‌గా ప్రమోషన్‌ ఇస్తారనే ప్రచారం జరిగినా తనకా ఉద్దేశ్యం లేదని ఖరాకండిగా చెప్పుకొచ్చారట.

ఏదేమైనా శాసనసభాపతి పదవి వద్దంటూ తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారు. మరి ఆ స్థానంలో కూర్చునేదెవరు..? ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎవరిని ఒప్పిస్తారు..? ఆ పీఠంపై కూర్చునే ధైర్యశాలి ఎవరు..? మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories