టార్గెట్‌ ఎమ్మెల్సీ... టీఆర్‌ఎస్‌ యాక్షన్‌ ప్లాన్‌

టార్గెట్‌ ఎమ్మెల్సీ... టీఆర్‌ఎస్‌ యాక్షన్‌ ప్లాన్‌
x
Highlights

రెండున్నర నెలల నుంచి ఎన్నికల హడావిడి... గెలుపు తీపి తడి ఆరకముందే మరో ఎన్నికల పండుగ రాబోతోంది. అదే ఎమ్మెల్సీ ఎన్నికల పండుగ. 88 స్థానాల్లో విజయ దుందుభి...

రెండున్నర నెలల నుంచి ఎన్నికల హడావిడి... గెలుపు తీపి తడి ఆరకముందే మరో ఎన్నికల పండుగ రాబోతోంది. అదే ఎమ్మెల్సీ ఎన్నికల పండుగ. 88 స్థానాల్లో విజయ దుందుభి మోగించిన టీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు తన ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.

మరోసారి అధికారం చేజిక్కించుకుని మంచి ఊపుమీదున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలపై దృష్టి సారించింది. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి వదులుకోనున్నారు. వీరితో పాటు పార్టీ మారిన కొండా మురళి, రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతిరెడ్డిలపై మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు ఫిర్యాదు చేయనున్నారు. వీరిపై అనర్హత వేటు వేయించి వాటిని దక్కించుకోవాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది.

మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి మహమూద్ అలీ, విపక్ష నేత షబ్బిర్ అలీ సహా 9మంది ఎమ్మెల్సీలకు వచ్చే మార్చితో పదవీ కాలం ముగియనుంది. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డితో రాజీనామా చేయించి మళ్లీ పోటీ చేయించాలని యోచిస్తున్నారు. రాములు నాయక్ పై వేటు పడితే గవర్నర్ కోటాలో ఓ ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్ సొంతం అవుతుంది.

మండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ సభాపతులు సురేష్ రెడ్డి, మధుసూధానాచారి, గుత్తా సుఖేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరితో పాటు మరికొందరి పేర్లు కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శాసన సభ్యుల కోటా కింద ఏడు స్థానాలు దక్కించుకోనేందుకు పావులు కదుపుతున్నారు. దీని కోసం ఇప్పటికే మజ్లిస్ తో టీఆర్ఎస్ చర్చించింది. స్థానిక సంస్థల నియోజకవర్గాల కింద రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఖాళీలు ఏర్పడితే వాటిని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించారు. శాసన సభ ఎన్నికల్లో టికెట్ దక్కని వారితో పాటు ఓడిపోయిన సీనియర్లు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరి ఎవరెవరికి ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories