logo

పెళ్లి బరాత్‌లో తల్వార్‌ తగిలి యువకుడు మృతి

Highlights

బరాత్‌‌.... హైదరాబాద్‌ పాతబస్తీలో ఇది వెరీవెరీ స్పెషల్‌... తుపాకీతో గాల్లో కాల్చినా... తల్వార్లను తిప్పుతూ...

బరాత్‌‌.... హైదరాబాద్‌ పాతబస్తీలో ఇది వెరీవెరీ స్పెషల్‌... తుపాకీతో గాల్లో కాల్చినా... తల్వార్లను తిప్పుతూ హల్‌చల్‌ చేసినా, భయంకరమైన విన్యాసాలు అది పాతబస్తీకే చెల్లు... ఈ ప్రమాదకరమైన విన్యాసాలపై ఖాకీలు చోద్యం చూస్తారనే విమర్శలున్నాయి. కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహారిస్తారు. అందుకే మరోసారి పాతబస్తీలో తల్వార్లు వీరంగమాడాయి. మైనర్లు కత్తులు తిప్పి ఓ ప్రాణం బలి తీసుకున్నారు.

సరదాలకుపోయి ఆయుధాలతో విన్యాసాలు చేయడం తీవ్రంగా గాయపడటం పాతబస్తీ యువతకు సర్వసాధారణమైపోయింది. పాతబస్తీలో పెళ్లి బరాత్, పుట్టినరోజు వేడుక ఏదైనాసరే తుపాకులు, కత్తులు చేతపట్టుకొని వీరంగమాడటం సాధారణంగా మారింది. గతేడాది పాతబస్తీలో జరిగిన ఒక పెళ్లి బరాత్‌లో యువకుడు రెండు పెద్ద తల్వార్లను పట్టుకుని కత్తి విన్యాసం చేశాడు. ఈ క్రమంలో అతని తలకు తీవ్ర గాయమైంది. ఓవైపు రక్తం కారుతున్నప్పటికీ ఆ యువకుడు తన విన్యాసాన్ని ఆపలేదు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో పక్కనున్నవారు గాయపడిన యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పాతబస్తీలో అర్ధరాత్రి తరువాత జరిగే విందు వినోదాల్లో కత్తుల ప్రదర్శన, గాల్లో కాల్పులు సర్వసాధారణంగా మారాయి. లైసెన్సెడ్‌ తుపాకులతోనే దర్జాగా బరాత్‌ సంబరాల్లో దర్జా చాటుతున్న వారే అధికం. వెండితెరపై హీరోలు తుపాకులతో చేసే విన్యాసాలను ఇక్కడ అనుకరించటం విశేషం. ఫలక్‌నుమా, ఛతిన్రాక, చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, శాలిబండ, రైన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి.

ఫలక్‌నుమా పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో రెండేళ్ల క్రితం ఓ బడాబాబు కుమారుడు తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఫలక్‌నుమా ఏసీపీ కార్యాలయం, బండ్లగూడ తహసీల్దార్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో 12 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆందోళనకు గురైన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చినా పట్టించుకోలేదు. బడాబాబు కుమారుడు కావడంతోనే పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయారనే విమర్శలున్నాయి.

మొత్తానికి పాతబస్తీలో పెళ్లి, పుట్టినరోజు వేడుకల సందర్భంగా కత్తులు, తుపాకులతో వీరంగం సృష్టిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి అందుకే ప్రత్యేక నిఘాతోపాటు కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు రిపీట్ కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు బరాత్‌ల సమయంలో రోడ్లన్నీ బ్లాక్‌ చేస్తున్నారని, దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top